హరిహర వీరమల్లు ఇంకో విడుదల తేదీ వచ్చేసింది. గత వారం రోజులుగా ప్రచారంలో ఉన్న జూలై 24ని అధికారికంగా ఖరారు చేస్తూ కొత్త పోస్టర్ తో నిర్మాత ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు అందరి మనసులో ఉన్నది ఒక్కటే. ఈసారి భూమి బద్దలైనా మాట తప్పకూడదు. ఇప్పటికే పలు వాయిదాలతో ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ మీద బజ్ తగ్గిపోవడం బయ్యర్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ట్రైలర్ తో ఈ లెక్కలన్నీ మారుస్తామని టీమ్ చెబుతున్న మాట మీదే అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. బిజినెస్ పరంగా నెంబర్ల మీద ఈ అంశమే ప్రభావం చూపించనుంది.
ఇప్పటి నుంచి నెల రోజులకు పైగా టైం ఉంది కాబట్టి ప్రమోషన్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్యాన్ ఇండియా రిలీజ్ కనక ఇతర భాషల్లో పబ్లిసిటీ కీలకం కానుంది. తాను సహకరిస్తానంటూ పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు కనక నిర్మాత ఏఎం రత్నం ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకోవాలి. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయడం ద్వారా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించవచ్చు. డిప్యూటీ సిఎంగా పవన్ బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన రాని, రాలేని ప్రోగ్రాంస్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. బాబీ డియోల్, నిధి అగర్వాల్, సత్యరాజ్ తదితరులను యాక్టివ్ చేయాలి.
కీరవాణి సంగీతం ఆడియో పరంగా పెద్దగా అద్భుతాలు చేయలేకపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆర్ఆర్ఆర్ రేంజ్ లో ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జూలై నెల నితిన్ తమ్ముడుతో ప్రారంభం కానుంది. విజయ్ దేవరకొండ కింగ్ డమ్ డేట్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. వీరమల్లుతో క్లాష్ అవుతూ జూలై 25 లేదా సేఫ్ గేమ్ అయ్యేలా ఆగస్ట్ 1 ఇలా రెండు తేదీలు ప్రచారంలో ఉన్నాయి. మొత్తానికి పోస్ట్ పోన్ల కథ క్లైమాక్స్ కు చేరుకుంది. ఇక హరిహర వీరమల్లు వెనుకడుగు వేయడానికి లేదు. సెప్టెంబర్ లో ఓజి ఫిక్సైన నేపథ్యంలో ఇప్పుడిక ఎలాంటి నిర్ణయాల మార్పుకు నో ఛాన్స్.
Gulte Telugu Telugu Political and Movie News Updates