వీరమల్లు డేటుకి ‘మెగా’ సెంటిమెంట్

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత ఖరీదైన, ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకున్న సినిమాగానే కాక విపరీతమైన వాయిదాలు వేసుకున్న మూవీగా హరిహర వీరమల్లు ఇప్పటిదాకా ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయ్యిందో ఠక్కున చెప్పడం కష్టం. మొన్న కూడా చివరి నిమిషం దాకా జూన్ 12 అని ఊరించి పోస్టర్లు వేసిన తర్వాత ఆపేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు దారులన్నీ క్లియరయ్యాయని అంటున్నారు. రేపు ఉదయం వదలబోయే కొత్త పోస్టర్ లో కొద్దిరోజుల నుంచి తెగ ప్రచారంలో ఉన్న జూలై 24 డేట్ నే అఫీషియల్ గా లాక్ చేయబోతున్నట్టు సమాచారం. అయితే దీనికి మెగా బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ ఉండటం గమనార్హం.

1998 జూలై 24 పవన్ కళ్యాణ్ తొలిప్రేమ థియేటర్లలో అడుగు పెట్టింది. లవ్ స్టోరీగా రిలీజై వసూళ్ల సునామితో రికార్డులు బద్దలు కొట్టింది. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు పెట్టిన నైజాం హక్కుల మొత్తాన్ని ఒక్క సంధ్య 70 ఎంఎం థియేటర్ లోనే రాబట్టడం బట్టి చెప్పొచ్చు దీని రేంజ్ ఏమిటో. యూత్ లో పవన్ కు విపరీతమైన ఫాలోయింగ్ మొదలయ్యింది తొలిప్రేమ నుంచే. ఆ తర్వాత 2002 జూలై 24 ఇంద్ర రిలీజయ్యింది. అప్పటిదాకా ఉన్న టాలీవుడ్ రికార్డులన్నీ తుడిచిపెట్టిన మెగాస్టార్ కొన్నేళ్ల పాటు వాటిని తానే బద్దలు కొట్టలేకపోయారు. ఫ్యాక్షన్ జానర్ లో చిరంజీవి విశ్వరూపానికి బాక్సాఫీస్ దాసోహమంది.

ఇప్పుడు ఇదే డేట్ కి హరిహర వీరమల్లు ఫిక్స్ కావడం అభిమానులు శుభ సూచకంగా ఫీలవుతున్నారు. నిర్మాత ఏఎం రత్నం కంటెంట్ మీద మాములు కాన్ఫిడెన్స్ తో లేరు. దర్శకుడు జ్యోతికృష్ణ అహోరాత్రాలు ఫైనల్ కాపీ వర్క్స్ చూసుకోవడంలో బిజీగా ఉండగా కీరవాణి రీ రికార్డింగ్ పనులు ఇంకో వారంలో మొదలుపెట్టొచ్చని సమాచారం. ఇప్పటిదాకా బజ్ ఎలా ఉన్నా ట్రైలర్ తో మొత్తం మార్చేస్తామనే ధీమా టీమ్ లో కనిపిస్తోంది. పవన్ ఏపీ డిప్యూటీ సిఎం అయ్యాక వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ దీన్ని చాలా స్పెషల్ గా ఫీలవుతున్నారు. రేపు విడుదల తేదీతో పాటు ట్రైలర్ అప్డేట్ ఉంటుందేమో చూడాలి.