హాయ్ నాన్న కాంబో రూటు మారుస్తోంది

మంచి ఎమోషనల్ మూవీగా బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న హాయ్ నాన్న విడుదలై ఏడాదిన్నర గడిచిపోయింది. ఇప్పటిదాకా దర్శకుడు శౌర్యువ్ కొత్త సినిమా మొదలు కాలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అతను జూనియర్ ఎన్టీఆర్ కోసం విశ్వప్రయత్నం చేశాడు. ఒక కథ గురించి ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదిరినా తారక్ డేట్లు ఇంకో రెండు మూడేళ్ళ దాకా దొరికే పరిస్థితి లేకపోవడంతో శౌర్యువ్ అప్పటిదాకా వెయిట్ చేయడం కష్టం. దీంతో తిరిగి నాని దగ్గరికే వచ్చి ఓకే చేయించుకున్నట్టు తెలిసింది. ఇది అదే సబ్జెక్టా లేక వేరేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదింకా ప్రాధమిక దశలో ఉంది కాబట్టి నిర్ధారణగా చెప్పలేం.

ప్రస్తుతం నాని ఫోకస్ మొత్తం ది ప్యారడైజ్ మీదే ఉంది. ప్రస్తుతానికి చిన్న బ్రేక్ తీసుకున్నా జూలై నుంచి ఏకధాటిగా షూటింగ్ చేయబోతున్నారు. ప్రొడక్షన్ కే పది నెలల సమయం పట్టొచ్చని ఒక అంచనా. ఈ కారణంగా ముందు అనుకున్న మార్చి 26 విడుదల తేదీని మార్చుకునే అవకాశాలున్నాయని ఆల్రెడీ టాక్ ఉంది. ఇదిలా ఉండగా తాజాగా శౌర్యువ్ చెప్పిన కథ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. హాయ్ నాన్నలో విపరీతమైన భావోద్వేగాలను చూపించిన ఈ దర్శకుడు ఈసారి కమర్షియల్ రూటు పట్టుకుని కొత్త తరహా స్టోరీ సిద్ధం చేశాడని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కారణాలు ఏమైనా శౌర్యువ్ లాంటి కొత్త డైరెక్టర్లు ఇన్నేసి నెలలు వెయిట్ చేసి కొత్త సినిమాలు మొదలుపెట్టకపోవడం టాలీవుడ్ లో తరచుగా కనిపిస్తూనే ఉంది. ఈ కారణంగానే సాయి రాజేష్, తరుణ్ భాస్కర్ లాంటి ప్యాన్ ఇండియాలు లేని దర్శకులు సైతం ఏడాదికి పైగానే గ్యాప్ తీసుకుంటున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేయడమే కష్టంగా మారిపోయిన పరిస్థితుల్లో ఇలా అప్ కమింగ్ డైరెక్టర్లు కూడా అదే బాట పట్టడం థియేటర్లను నెలల తరబడి ఖాళీగా ఉంచుతోంది. ఇప్పుడు శౌర్యువ్ ఎవరి బ్యానర్ లో చేస్తాడు లాంటి వివరాలన్నీ అధికారిక ప్రకటన వచ్చే దాకా వేచి చూడాల్సిందే.