ఎమోషనల్ లవ్ స్టోరీస్ ఎన్ని తీసినా దర్శకుడు శేఖర్ కమ్ముల అభిమానులు ప్రత్యేకంగా ఫీలయ్యే సినిమా లీడర్. దగ్గుబాటి రానా డెబ్యూ మూవీగా ఏవిఎం ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ పొలిటికల్ మూవీ అప్పట్లో రికార్డులు బద్దలు కొట్టకపోయినా కంటెంట్ పరంగా మూవీ లవర్స్ మనసులు గెలుచుకుంది. ముఖ్యంగా కొన్ని ఎపిసోడ్లు భూత, వర్తమాన, భవిష్యత్ రాజకీయాలకు అద్దం పట్టే విధంగా ఉంటాయి. 2010 లో రిలీజైన లీడర్ కు కొనసాగింపు కావాలని ఫాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు కానీ శేఖర్ కమ్ముల అప్పుడప్పుడు దాటవేస్తూ వచ్చారు కానీ మళ్ళీ కుబేర ప్రమోషన్లలో భాగంగా దాని ప్రస్తావన వచ్చింది.
లీడర్ 2 ఆలోచన ఉంది కానీ అప్పటికి ఇప్పటికి రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయని, ఓటర్లు తెలివి మీరిపోయారని, నాయకులని మించిన పరిణితి వాళ్లలో కనిపిస్తోంది కాబట్టి కథ పరంగా పెద్ద సవాల్ ని ఎదురు కోవాల్సి ఉంటుందని అన్నారు. శేఖర్ కమ్ముల చెప్పింది నిజమే. ఎందుకంటే ఇప్పటి పొలిటికల్ వాతావరణం మహా సున్నితంగా ఉంది. చీటికీ మాటికీ మనోభావాలు దెబ్బ తింటున్నాయి. వ్యవహారాలు కోర్టు కేసుల దాకా వెళ్తున్నాయి. ఎవరిని ఏమి నేరుగా అనకపోయినా ఎవరికి వాళ్ళు అన్వయించేసుకుని నానా రచ్చ చేస్తున్నారు. ఎక్కడైనా సినిమా వేడుకల్లో రాజకీయాలు మాట్లాడినా చాలు బాయ్ కాట్ అనేస్తున్నారు.
ప్రాక్టికల్ గా చూస్తే లీడర్ 2 వచ్చే అవకాశాలు దాదాపు లేనట్టే. ఎందుకంటే రానా ఇమేజ్ కూడా మారిపోయింది. హీరో నుంచి విలన్ అటు నుంచి సపోర్టింగ్ ఆర్టిస్టుగా మారిపోయాడు. నిర్మాతగా ఎక్కువ బిజీ ఉంటున్నాడు. లీడర్ మొదటి భాగంలో కనిపించిన లేతదనం ఇప్పుడు లేదు. సో సీక్వెల్ లో తననే తీసుకుంటే శేఖర్ కమ్ములకు అది నిజంగా పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అయినా వివాదాలకు దూరంగా ఉండే ఈయన ఇప్పుడు లీడర్ 2 రాసుకున్నా దాన్ని అన్ని వర్గాలకు మెప్పించేలా చెప్పడం పెద్ద సవాల్. దానికన్నా ఫ్రెష్ కథలతో, కుబేర లాంటి ఇన్నోవేటివ్ థాట్స్ తో సినిమాలు తీయడం శ్రేయాస్కరమేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates