ఢీ-2… వైట్ల దగ్గర కథ లేదా?

శ్రీను వైట్లను స్టార్ డైరెక్టర్‌ను చేసిన సినిమా.. ఢీ. అప్పటిదాకా ఎక్కువగా లవ్ స్టోరీలు చేస్తూ వచ్చిన వైట్ల.. ఈ సినిమాతో కామెడీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు. కెరీర్లో హిట్టే లేని మంచు విష్ణును పెట్టి వైట్ల తీసిన ఈ సినిమాపై రిలీజ్ ముంగిట ఏమాత్రం అంచనాలు లేవు. కానీ విడుదల తర్వాత ఈ చిత్రం పెద్ద రేంజికి వెళ్లిపోయింది. టాలీవుడ్లో బెస్ట్ ఎంటర్టైనర్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. దీని తర్వాత వైట్ల స్టార్ డైరెక్టర్లలో ఒకడిగా ఎదిగిపోయాడు. నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి టాప్ స్టార్లను డైరెక్ట్ చేశాడు. 

ఐతే చాలా ఏళ్లుగా వైట్ల ఫామ్‌లో లేని సంగతి తెలిసిందే. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తర్వాత కొన్నేళ్లు కనిపించకుండా పోయిన వైట్ల.. తన కెరీర్‌ను మలుపు తిప్పి ‘ఢీ’కి సీక్వెల్‌ తీయడం ద్వారా రీఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. మంచు విష్ణుతో కథా చర్చలు జరిగాయి. ఇద్దరూ కలిసి కొన్నేళ్ల కిందట సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు కూడా. కానీ తర్వాత ఏమైందో తెలియదు. వైట్ల ఏమో గోపీచంద్‌తో ‘విశ్వం’ చేశాడు. విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’ మీదికి వెళ్లిపోయాడు.

మరి ‘ఢీ’ సీక్వెల్ సంగతి ఏమైందన్నది ప్రశ్నార్థకం. దీని గురించి మంచు విష్ణును అడిగితే.. దాని స్టేటస్ ఏంటో చెప్పాడు. తన కెరీర్లో ‘ఢీ’ చాలా స్పెషల్ మూవీ అని.. దానికి సీక్వెల్ చేయడాన్ని ఎంతో ఇష్టపడతానని అన్నాడు. కానీ ఆ సినిమాకు ఇంకా స్క్రిప్టు రెడీ కాలేదన్నాడు. అది శ్రీను వైట్ల, రచయితల చేతుల్లో ఉందని చెప్పాడు. వాళ్లు పక్కా స్క్రిప్టుతో వస్తే వెంటనే సినిమాను మొదలుపెట్టడానికి తాను సిద్ధమని మంచు విష్ణు ప్రకటించాడు.

ఐతే ఇంతకుముందు ‘ఢీ-2’ సినిమాను అనౌన్స్ చేశారే తప్ప.. అప్పటికి కథంటూ ఏమీ అనుకోలేదన్నమాట. స్క్రిప్టు లేకుండానే సినిమాను అనౌన్స్ చేయడం విచిత్రమే. లేదంటే బేసిక్ లైన్ చెప్పి విష్ణుతో ఓకే అనిపించి ఉంటాడు వైట్ల. విష్ణును మెప్పించే స్క్రిప్టు తయారుకాకపోవడంతో అతను ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లి ఉండడు. మరి ‘విశ్వం’తో ఓ మోస్తరు ఫలితాన్ని అందుకుని కొంచెం ఉత్సాహం తెచ్చుకున్న వైట్ల.. ఇప్పుడైనా ‘ఢీ-2’ స్క్రిప్టు రెడీ చేసి విష్ణును మెప్పించి, ప్రాజెక్టును పట్టాలెక్కిస్తాడేమో చూడాలి.