శేఖర్ కమ్ములకు నాగ్ ఎలివేషన్

ప్రతి హీరో తన దర్శకుడిని పొగడ్డం మామూలే కానీ.. శేఖర్ కమ్ములను గురించి అక్కినేని నాగార్జున కొనియాడుతున్న తీరు మాత్రం ప్రత్యేకం. ఏదో పొగడాలి కాబట్టి పొగడాలి అన్నట్లు కాకుండా శేఖర్ గురించి నాగ్ చెప్పే మాటలన్నీ మనసు లోతుల్లోంచి వస్తున్నట్లే కనిపిస్తున్నాయి. బేసిగ్గా శేఖర్‌తో పని చేసిన ప్రతి ఒక్కరూ తన వ్యక్తిత్వానికి ఫిదా అయిపోతుంటారు. ఆయన తమను వ్యక్తితంగా ఎంత ప్రభావితం చేశాడో చెబుతుంటారు. నాగ్ కూడా అందుకు మినహాయింపు కాలేదు.

మొన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ‘మాయాబజార్’కు కేవీ రెడ్డి ఎలా హీరోనో.. ‘కుబేర’కు తాను, ధనుష్ కాకుండా కమ్ములనే హీరో అంటూ గొప్ప ఎలివేషన్ ఇచ్చిన నాగ్.. తాజాగా ‘కుబేర’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సైతం కమ్ముల మీద ప్రశంసల జల్లు కురిపించాడు. తనతో పని చేయడం చాలా హాయిగా ఉంటుందని.. వ్యక్తిగా అతను చాలా అరుదైన వాడని అన్నాడు. శేఖర్ కమ్ములతో పని చేయాలని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని.. ఐతే తనకంటే ముందు తన కొడుకు నాగచైతన్యకు ఆ అవకాశం లభించిందని నాగ్ చెప్పాడు. 

ఈ విషయంలో అతను సీనియర్ కాబట్టి శేఖర్‌తో ఎలా ఉంటుంది అని అడిగానని.. ఒక చిన్న పిల్లాడిలా చాలా స్వచ్ఛంగా ఉంటాడని చెప్పాడన్నాడు. ఈ సినిమా చిత్రీకరణ జరిగేన్ని రోజులు మీరు చాలా లక్కీ.. షూట్ అయ్యాక మీరు కొత్త వ్యక్తిగా మారతారు అని చెప్పాడని నాగ్ గుర్తు చేసుకున్నాడు. చైతూ చెప్పింది అక్షరాలా నిజమని.. తనది స్వచ్ఛమైన హృదయమని.. తన మీద వ్యక్తిగతంగా కమ్ముల ఎంతో ప్రభావం చూపించాడని నాగ్ చెప్పాడు. ‘కుబేర’కు సంబంధించి చెన్నైలో జరిగిన ఈవెంట్లో ధనుష్ తమిళంలో మాట్లాడుతూ.. కమ్ముల లాంటి వాళ్లు ఉండడం వల్లే ఇంకా వర్షాలు పడుతున్నాయని అన్నాడని.. ఐతే అతనేం మాట్లాడాడో అర్థం కాకుండానే కమ్ముల పిల్లాడిలా చప్పట్లు కొడుతూ కనిపించాడని.. ధనుష్ ఏం చెప్పాడో తాను తర్వాత వివరించానని నాగ్ గుర్తు చేసుకున్నాడు.