మారుతీ చెప్పిన షాకింగ్ విషయాలు

ది రాజా సాబ్ టీజర్ తో తన మీదున్న సందేహాలకు దర్శకుడు మారుతీ దాదాపు చెక్ పెట్టినట్టే. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా హీరోని ఇంత గ్రాండియర్ స్కేల్ లో హారర్ డ్రామాని ప్లాన్ చేయడమే పెద్ద సాహసం. దాన్ని కన్విన్సింగ్ గా ఆడియన్స్ కి అనిపించేలా టీజర్ రూపంలో ముందే క్లారిటీ ఇవ్వడం ప్రమోషన్స్ పరంగా చాలా హెల్ప్ కానుంది. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో జరిగిన ఈ వేడుకలో తెరమీద కంటెంట్ చూసిన ఫ్యాన్స్ మారుతీకి ఏకంగా గుడి కడతామనే రేంజ్ లో ఎలివేషన్ ఇవ్వడం చూస్తే వాళ్ళకు ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా మారుతీ కొన్ని షాకింగ్ విషయాలు పంచుకున్నారు.

పక్కా కమర్షియల్ షూటింగ్ టైంలో తన దర్శకత్వంలో ప్రభాస్ తో రాజాసాబ్ తీద్దామని ప్లాన్ చేసుకున్న నిర్మాత తర్వాత ఆ సినిమా ఫ్లాప్ కావడం చూసి డ్రాపయ్యారని, ఇదే విషయం తాను యువి వంశీకి చెప్పి ప్రస్తుతానికి క్యాన్సిల్ చేసి మళ్ళీ చూద్దాం లెమ్మని చెప్పారట. సాయంత్రానికి ప్రభాస్ మారుతికి ఫోన్ చేసి ఫలానా సీన్లు బాగున్నాయి, కామెడీ బాగుందని చెబుతుంటే కొత్త ఉత్సాహంతో మళ్ళీ ఊపిరొచ్చిందని చెప్పాడు. హైదరాబాద్ వచ్చిన ఉద్దేశం ఇలా తప్పుకోవడం కాదని, గెలిచి చూపించడమని గుర్తించి తన వెంట నిలబడ్డ ప్రభాస్ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా రాజా సాబ్ ఇస్తానని మారుతి చెప్పడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని, అసలు ట్రైలర్ తర్వాత సినిమా ఏ స్థాయిలో ఉంటాయో మీరు ఊహించలేరని అన్నాడు. దీన్ని బట్టి మారుతీ ఆషామాషీగా రాజా సాబ్ తీయలేదని అర్థమవుతుంది. ఇదే వేడుకలో ఎస్కెఎన్ తన ప్రసంగంలో మాట్లాడుతూ రాజా సాబ్ ప్రకటన తర్వాత ఒక నిర్మాత కావాలని నెగటివ్ పబ్లిసిటీ చేశారని, ఇప్పుడు సినిమా చూశాక ఆయనే పాజిటివ్ గా చెబుతారని అన్నాడు. ఎలాంటి క్లూ ఇవ్వకపోయినా సోషల్ మీడియా ఫ్యాన్స్ మాత్రం రకరకాల పేర్లు అన్వయించుకుంటున్నారు. మొత్తానికి పడ్డ చోటే గెలవాలనేది ఇండస్ట్రీ నానుడి. దానికి ప్రభాస్ లాంటి వాళ్ళు చేయూతనివ్వడం కన్నా ఏం కావాలి. మారుతీకి దొరికింది అదే.