బాలీవుడ్ మీద దృష్టి పెడుతున్న అఖండ 2

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో తెరకెక్కిన అఖండ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. సెప్టెంబర్ 25 పవన్ కళ్యాణ్ ఓజితో క్లాష్ ఉన్న నేపథ్యంలో బాలయ్య సినిమా వాయిదా పడుతుందనే ప్రచారం అభిమానుల్లో ఉంది. కానీ 14 రీల్స్ టీమ్ మాత్రం అదేమీ లేదనే తరహాలో సంకేతాలు ఇస్తోంది. దసరా పండగ రిలీజ్ వదులుకునే ఆలోచన లేదని, ఇంకా బ్యాలన్స్ షూటింగ్ ఉన్నప్పటికీ డెడ్ లైన్ మీటయ్యేలా పక్కా ప్లానింగ్ అమలవుతోందని అంటున్నారు. ఇటీవలే రిలీజైన టీజర్ కు భారీ స్పందన వచ్చింది. చిన్న వీడియోనే అయినా అంచనాలు అమాంతం పెంచడానికి ఇది ఉపయోగపడుతోంది.

అఖండ 2 టీమ్ ఈసారి ఉత్తరాది ప్రమోషన్ల మీద ప్రత్యేక దృష్టి పెడుతోంది. ముంబై లాంటి ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున హోర్డింగ్స్, పోస్టర్స్ పెట్టించింది. సుమారు రెండు కోట్ల రూపాయలు ఇప్పటికే పబ్లిసిటీ కోసం ఖర్చయినట్టు సమాచారం. ఇంత ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడానికి కారణం లేకపోలేదు. థియేటర్ మిస్ అయిన ఉత్తరాది ప్రేక్షకులు అఖండని ఓటిటిలో చూసి భారీ ప్రశంసలు గుప్పించారు. కాంతార, కార్తికేయ 2 లాంటివి అక్కడ భారీ విజయం సాధించడం చూసి వాటి కన్నా ఎక్కువ డివోషనల్ కంటెంట్ ఉన్న అఖండ 2 ఇంకా బాగా రిసీవ్ అవుతుందనే నమ్మకంతో పబ్లిసిటీ  మీద దృష్టి సారిస్తున్నారు.

సీనియర్ హీరోల్లో ఇప్పటిదాకా ఎవరూ హిందీ మార్కెట్ మీద పట్టు సాధించలేకపోయారు. సైరా నరసింహారెడ్డితో చిరంజీవికి ఆ ఆశ నెరవేరలేదు. వైల్డ్ డాగ్, ఘోస్ట్ తో నాగార్జున ట్రై చేస్తే ఫలితం దక్కలేదు. వెంకటేష్ సైతం సైంధవ్ తో ఫెయిలయ్యారు. సో ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య కనక అఖండ 2తో అక్కడ హిట్టు కొడితే జాక్ పాట్ తగిలినట్టే. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ స్పిరిచువల్ యాక్షన్ డ్రామాకు తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులో బాలయ్య మొత్తం మూడు గెటప్స్ లో కనిపించనున్నారు. వాటి మధ్య ట్విస్టులు ఊహకందని స్థాయిలో ఉంటాయని టాక్.