జూలై 18…గురి పెట్టుకున్న వీరమల్లు

వాయిదాల మీద వాయిదాలతో ఫ్యాన్స్ సహనంతో పాటు ఇతర రిలీజులతో ఆడుకున్న హరిహర వీరమల్లు విడుదల తేదీ వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు జూలై 18 రిలీజ్ కు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ట్రైలర్ రెడీ అయ్యాక అందులోనే డేట్ పొందుపరిస్తారని టాక్. వాస్తవానికి ఈ నెలాఖరే వస్తుందనే ప్రచారం కొద్దిరోజుల క్రితం జరిగింది. కానీ మంచు విష్ణు కన్నప్ప తప్పుకునే ఉద్దేశంలో లేడు. క్లాష్ వల్ల ఇద్దరికి ఇబ్బంది కలుగుతుందనే కోణంలో చర్చలు జరిగాయట. మార్కెట్ పరంగా పవన్, విష్ణు ఒకటే కాకపోయినా కన్నప్పకు ప్రభాస్ ఆకర్షణ బలంగా నిలుస్తోంది.

ఒకవేళ జూలై 18 నిజమైన పక్షంలో నెల రోజుల సమయం మిగిలిన పనులకు సరిపోతుంది. ప్రమోషన్లకు వస్తానని పవన్ కళ్యాణ్ నిర్మాత ఏఎం రత్నంకు హామీ ఇచ్చారట. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే కాక ముఖ్యమైన వాళ్లకు ఇంటర్వ్యూలు, ఏదైనా స్పెషల్ ప్రోగ్రాంస్ లాంటి వాటికి చేయూతనిస్తానని హామీ ఇచ్చినట్టుగా వినికిడి. ఇది ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఎందుకంటే ముందస్తుగా జరిగే వేడుకకు తప్ప పవన్ ఇంకెలాంటి పబ్లిసిటీ క్యాంపైన్స్ లో ఉండరు. కానీ హరిహర వీరమల్లుకి మినహాయింపు ఇవ్వడం మంచి నిర్ణయం. ట్రైలర్ ఇంకో వారం పది రోజుల్లో రెడీ చేసి దాని లాంచ్ గ్రాండ్ గా చేయాలనే ప్లానింగ్ ఉంది.

ప్రస్తుతానికి వీరమల్లు వస్తున్న స్లాట్ ఖాళీగా ఉంది. ముందు వారం జూలై 11 అనుష్క ఘాటీ మాత్రమే ఉంది. దాని ప్రచారాలు కూడా యువి సంస్థ ఇంకా మొదలుపెట్టలేదు. ఒకే రోజు కాదు కాబట్టి ఇబ్బందేం ఉండదు. ఎలా చూసుకున్నా హరిహర వీరమల్లుకి ఇది బెస్ట్ డేట్. ఎందుకంటే ఆగస్ట్ 1 కింగ్ డమ్ వచ్చే ఆలోచనలో ఉంది. 14న వార్ 2, కూలీ దిగుతాయి. తర్వాత రవితేజ మాస్ జాతర ఉంటుంది. వాటిని డిస్ట్రబ్ చేయడం కంటే ముందు వచ్చేయడం బెటర్. విశ్వంభర కనుచూపు మేరలో వచ్చే సూచనలు లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ చూపంతా వీరమల్లు అప్డేట్స్ మీదే ఉంది. అన్నీ పక్కా అయ్యాక ప్రమోషన్ రీస్టార్ట్ చేస్తారు.