అల్లు అరవింద్‌కు ఇంకో ఇద్దరు కొడుకులు

పీఆర్వోగా ప్రయాణం మొదలుపెట్టి..ఇప్పుడు నిర్మాతగా బిజీ అయిపోయాడు ఎస్కేఎన్. ఆయన స్టేజ్ ఎక్కితే చాలు.. ఆడిటోరియాలు హోరెత్తిపోతుంటాయి. ఎస్కేఎన్ స్పీచ్‌లకు ప్రత్యేకంగా అభిమానులు తయారయ్యారు అంటే అతిశయోక్తి కాదు. మంచి పంచ్ డైలాగులతో స్పీచ్‌లు ప్రిపేరై వచ్చే ఎస్కేఎన్.. ప్రేక్షకుల్లో మాంచి జోష్ తీసుకొస్తుంటాడు. తన మిత్రుడు, నిర్మాణ భాగస్వామి అయిన బన్నీ వాసు.. సొంతంగా ప్రొడ్యూస్ చేసిన ‘మిత్రమండలి’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లోనూ ఎస్కేఎన్ తన మార్కు స్పీచ్‌తో అలరించాడు. ముఖ్యంగా అల్లు అరవింద్‌ను ఉద్దేశించి ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు ఏఏఏ మల్టీప్లెక్స్‌‌లోని ఆడిటోరియాన్ని నవ్వుల్లో ముంచెత్తాయి.

ఏఏఏ మల్టీప్లెక్స్ తమకు బాగా కలిసి వచ్చిన వేదిక అని, దాన్ని తమ సొంతం అని భావిస్తామని చెబుతూ అల్లు అరవింద్ తనతో పాటు బన్నీ వాసుకు ఇందులో అన్ డివైడెడ్ షేర్ రాసి ఉంటాడని ఎస్కేఎన్ పేర్కొనడం విశేషం. ఈ మాట చెప్పి.. అల్లు అరవింద్‌ను ఆది దేవుడిగా అభివర్ణిస్తూ ఆయన పాద పద్మములకు నమస్కారాలు అనడంతో అరవింద్ సహా అందరూ పగలబడి నవ్వారు. అంతటితో ఆగకుండా ప్రపంచానికి తెలిసి అల్లు అరవింద్‌కు ముగ్గురే కొడుకులని.. కానీ తాను, బన్నీ వాసు కూడా ఆయనకు కొడుకులతో సమానమే అని ఎస్కేఎన్ అన్నాడు. ఆయన ఆస్తుల్లో తమకు కూడా వాటా ఉండొచ్చని.. జూబ్లీహిల్స్ చివర్లో ఉండే పెద్ద బిల్డింగ్ లాంటి వాటిలో తమకు కూడా షేర్ రాస్తారని అతను చమత్కరించాడు. ఆస్తుల్లో వాటా గురించి తాము అడక్కపోవడం తమ సంస్కారం అని.. రాసి ఇవ్వడం అరవింద్ మంచితనమని ఎస్కేఎన్ అనడంతో అరవింద్ పగలబడి నవ్వారు. ఆడిటోరియం కూడా గొల్లుమంది.

ఈ చమత్కారం అయిపోయాక.. కొంచెం సీరియస్‌గానే అరవింద్‌ను కొనియాడాడు ఎస్కేఎన్. అరవింద్ దగ్గర ఉండేవాళ్లు ఎవరైనా సరే.. అరచేతిలో ఐదు వేళ్లలా ఉండేవాళ్లు పిడికిలిగా మారుతారని.. ఆయన ఇచ్చే శక్తి అలాంటిదని ఎస్కేఎన్ అన్నాడు. ఇన్నాళ్లూ గీతా ఆర్ట్స్‌లో భాగస్వామిగా ఉంటూ సినిమాలు నిర్మించిన బన్నీ వాసు.. ఇప్పుడు ‘బన్నీ వాసు వర్క్స్’ పేరుతో సొంతంగా బేనర్ పెట్టి తన అభిరుచి మేరకు వేరే చిత్రాలు కూడా తీయడానికి సిద్ధమయ్యాడు. అలా అని అతను గీతా బేనర్ నుంచి బయటికి ఏమీ రాలేదు. ఈ బేనర్ మీద తొలిసారిగా నిర్మించిన చిత్రమే.. మిత్రమండలి. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, నిహారిక.ఎం కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్ సరదాగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.