తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు చాలా ఓపెన్ అయ్యారు. కొన్ని విషయాల మీద కుండ బద్దలు కొట్టేశారు. యూట్యూబ్ వ్యూస్ ని కొనేసుకుని మిలియన్ల కొద్దీ చూశారనే ఫేక్ ప్రచారాలు ఇకపై ఆగాలని, డబ్బులు ఖర్చు పెట్టి ఇంత మందికి రీచ్ అయ్యిందని చెప్పుకోవడంలో అర్థం లేదని తేల్చి చెప్పారు. ఓసారి తన కుటుంబ సభ్యులు ఒక వీడియోకి పది మిలియన్ల వ్యూస్ వచ్చాయని ఆశ్చర్యపోతే, దాని వెనుక రహస్యం తెలిసిన వాడిగా ఏం చెప్పాలో తెలియక ఆగిపోయానని, అంతగా ఫేక్ ప్రచారాలకు ప్రొడ్యూసర్లు అలవాటు పడ్డారని గుట్టు విప్పేశారు. ఇది ఆలోచించాల్సిన విషయమే.
ఫ్యాన్స్ సంతృప్తి పరచడం కోసం ఇరవై నాలుగు గంటల్లో లేదా వారం రోజుల్లో ఇన్ని వ్యూస్ తో రికార్డులు బద్దలయ్యాయని చెప్పుకోవడానికి ప్రొడ్యూసర్లు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. డబ్బులు ఖర్చవ్వడంతో పాటు నెంబర్లు ఎప్పుడైనా ఎక్కువ తక్కువ వచ్చినా మళ్ళీ హీరోలకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ తలనెప్పి లేకుండా జెన్యూన్ గా ఎన్ని వ్యూస్ వస్తే అన్ని చూపించుకోవడం ఆరోగ్యకర పరిణామం. తమ్ముడుకి అదే ఫాలో అవుతానని దిల్ రాజు అంటున్నారు. అంతే కాదు ట్రైలర్ మీద నిజాయితీగా రియాక్షన్లు రావాలని కోరుకున్న రాజుగారు ఫేక్ ప్రాపగండా ఆగాలని, పొగడ్తలకు చెక్ పడాలని అన్నారు.
ఏదైతేనేం మొత్తానికి ఒక అగ్ర నిర్మాత నుంచి ఇలాంటి స్పందన రావడం ఆహ్వానించదగ్గదే. ఇకపై కలెక్షన్లలకు ప్రకటించే విషయంలో రెంట్రాక్ పద్దతి తీసుకొస్తామని, దీని వల్ల ఫేక్ నెంబర్లకు చెక్ పెట్టినట్టు అవుతుందని, దీనికి సంబంధించిన ప్రతిపాదన ఫిలిం ఛాంబర్ కు పంపించారని అన్నారు. ఇది నిజంగా అమలు కావాల్సిన చర్య. ఎందుకంటే స్టార్ హీరోల ఓపెనింగ్స్ గురించి నిర్మాతలు వేసుకుంటున్న నెంబర్లు భవిష్యత్తులో తప్పుడు సంకేతాలు ఇచ్చే దిశగా వెళ్తోంది. ఆఖరికి రీ రిలీజులకు సైతం ఈ పైత్యం మొదలైంది. దిల్ రాజు ప్రతిపాదించినట్టు ఇవన్నీ జరిగితే కనక పరిశ్రమకు అంత కన్నా కావాల్సింది ఏముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates