మంచు ఫ్యామిలీకి వివాదాలు కొత్త కాదు. ఇటీవల అన్నదమ్ముల వివాదం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఇక సినిమాలకు సంబంధించి కూడా తరచుగా ఏదో ఒక కాంట్రవర్శీ చుట్టు ముడుతూనే ఉంటుంది. గతంలో దేనికైనా రెడీ సినిమా విషయంలో పెద్ద గొడవ జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచేలా సన్నివేశాలున్నాయంటూ ఆ వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దాని మీద పెద్ద రభస జరిగింది. ఇప్పుడు మరోసారి బ్రాహ్మణ సంఘాలు మంచు వారి సినిమా మీద దండెత్తాయి. కన్నప్ప చిత్రంలో పిలక, గిలక అంటూ బ్రహ్మానందం, సప్తగిరి చేసిన బ్రాహ్మణ పాత్రలకు పేర్లు పెట్టడాన్ని ఈ సంఘాలు తప్పుబడుతున్నాయి.
సినిమా నుంచి ఈ రెండు పాత్రలను తీసేయాలని.. లేదంటే కన్నప్పను ఆడనివ్వమని హెచ్చరిస్తున్నాయి. ఇటీవల గుంటూరు కన్నప్పకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ జరగ్గా.. అదే రోజు అక్కడే నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ వివాదంపై మంచు విష్ణు తాజాగా స్పందించాడు.
ఎవరి మనోభావాలూ దెబ్బ తీయకుండా కన్నప్ప సినిమాను తీర్చిదిద్దినట్లు మంచు విష్ణు స్పష్టం చేశాడు. సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని.. హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ.. పరమశివుడిని భక్తితో చూపించామని విష్ణు చెప్పాడు.
ప్రతి రోజూ షూట్‌కు ముందు భక్తితో పూజించి.. వేద పండితుల ఆశీర్వచనం తీసుకునేవాళ్లమని.. స్క్రిప్టు దశలోనే వేదాధ్యయనం చేసిన వారితో పాటు పలువురు ఆధ్యాత్మికవేతల్ల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించామని విష్ణు తెలిపాడు. భక్తి తత్వాన్ని వ్యాప్తి చేయడానికే కన్నప్ప సినిమా తీశామని.. అంతే తప్ప వివాదాల కోసం కాదని.. విడుదలయ్యే వరకు ప్రతి ఒక్కరూ ఓపికతో ఉండాలని.. ముందే ఒక నిర్ణయానికి రావడం సరికాదని విష్ణు అభిప్రాయపడ్డాడు. కన్నప్ప సినిమాను శ్రీకాళహస్తి ఆలయానికి చెందిన వేదపండితులకు చూపించామని.. సినిమాలో ఒక్క సన్నివేశం మీదా వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేయలేదని.. అలాంటపుడు ఏ సన్నివేశం, పాత్ర అయినా ఎందుకు తీసేయాలని విష్ణు ప్రశ్నించాడు.