మంచు కుటుంబానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమా.. కన్నప్ప. ఈ సినిమా కోసం భారీగా డబ్బు మాత్రమే కాదు.. ఎన్నో ఏళ్ల కష్టాన్ని పెట్టాడు మంచు విష్ణు. దీని బడ్జెట్ ఎంత అన్నది స్పష్టంగా చెప్పలేదు కానీ.. తన మాటల్ని బట్టి చూస్తే రూ.200 కోట్లకు తక్కువ ఖర్చు కాలేదని స్పష్టమవుతోంది. మరి ఆ మేరకు బిజినెస్ అవుతోందా.. సినిమాకు సంబంధించి అన్ని హక్కులనూ అమ్మేశారా అంటే.. కాదనే సమాధానమే వినిపిస్తోంది. కానీ ‘కన్నప్ప’ మీద మంచు విష్ణు కాన్ఫిడెన్స్ మాత్రం మామూలుగా లేదు.
ప్రస్తుతం పేరున్న సినిమాలన్నింటికీ ముందే డిజిటల్ హక్కులు అమ్మేస్తున్నారు. ఆ ఆదాయంతో నిర్మాతలు సేఫ్ అయిపోవాలని చూస్తున్నారు. సినిమా రిలీజ్ తర్వాత ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి.. అప్పుడు వెళ్లి బేరాలు మాట్లాడితే కష్టం. అందుకే ముందే డీల్స్ పూర్తి చేస్తున్నారు. కానీ ‘కన్నప్ప’కు మాత్రం డిజిటల్ హక్కుల అమ్మకం జరగలేదట. ఐతే స్వయంగా విష్ణునే ఒక డీల్‌ను తిరస్కరించాడట. సినిమా రిలీజయ్యాకే హక్కులు అమ్మాలని, అప్పుడే ఎక్కువ రేటు వస్తుందని అతను భావించడమే అందుక్కారణం.
ఒక ప్రముఖ ఓటీటీ సంస్థతో కొన్ని నెలల ముందే సంప్రదింపులు జరిగాయని.. తాను ఒక పెద్ద నంబర్ ఆశించానని.. కానీ వాళ్లు చెప్పిన నంబర్ తనకు నచ్చలేదని విష్ణు వెల్లడించాడు. ఒకవేళ సినిమా హిట్టయి, ఇంత మొత్తం కలెక్ట్ చేస్తే అప్పుడు ఎంత రేటు ఇస్తారు అని అడిగితే.. వాళ్లు ఒక నంబర్ చెప్పారని, అది తనకు నచ్చిందని విష్ణు తెలిపాడు. సినిమా పెద్ద హిట్టయి కచ్చితంగా ఆ నంబర్ కలెక్ట్ చేస్తుందని తన నమ్మకమని.. అందుకే తర్వాత వస్తా, డబ్బులు రెడీ చేసుకోండి అని చెప్పి వచ్చేశానని విష్ణు తెలిపాడు. తాను సినిమా మీద పెట్టిన డబ్బులన్నీ థియేటర్ల నుంచే వచ్చేస్తాయని విష్ణు ధీమా వ్యక్తం చేయడం విశేషం.