ఈ మధ్య కనిపించడం తగ్గించేసిన లారెన్స్ కు చంద్రముఖి 2 డిజాస్టర్ పెద్ద షాకే ఇచ్చింది. రజనీకాంత్ సినిమాకు సీక్వెల్ కనక ముందు వెనుకా ఆలోచించకుండా దర్శకుడు పి వాసుని గుడ్డిగా నమ్మినందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. జిగర్ తండా డబుల్ ఎక్స్ మిగిలిన భాషల్లో సూపర్ ఫ్లాప్ అయినా తమిళంలో మంచి విజయం నమోదు చేసుకోవడం ఊరట కలిగించింది. అయితే ఒకప్పటిలా లారెన్స్ దూకుడుగా లేడు. కొంత నెమ్మదితనం పాటిస్తున్నాడు. ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగానే లోకేష్ సినిమాటిక్ యునివర్స్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. దాని పేరు బెంజ్.
లోకేష్ ఇచ్చిన కథతో బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో దీన్ని రూపొందిస్తున్నారు. మలయాళం క్రేజీ హీరో నివిన్ పౌలీ ఇందులో విలన్ గా నటించడం విశేషం. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. ఇదిలా ఉండగా బెంజ్ లో లారెన్స్ సరసన ఒకరిద్దరు కాదు ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. వాళ్లలో సంయుక్త మీనన్ దాదాపుగా లాకైపోయింది. ప్రియాంక అరుళ్ మోహన్ ఎస్ చెప్పిందట. మూడో భామగా మడోన్నా సెబాస్టియన్ ని తీసుకున్నారట. లియోలో విజయ్ చెల్లిగా తన పాత్ర ఆ మూవీలో చనిపోయింది. మరి బెంజ్ లో ఎలా చూపిస్తారనే డౌట్ రావడం సహజం. అంటే లియోకు ముందు జరిగే కథ బెంజన్నమాట.
త్వరలోనే బెంజ్ క్యాస్టింగ్ ని పూర్తిగా ప్రకటించబోతున్నారు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో ఊర మాస్ వయొలెన్స్ తో రూపొందే ఈ యాక్షన్ డ్రామాలో హీరోయిన్లకు తగినంత ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. 2025లోనే రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. ఇది కాగానే కాంచన 4 సెట్స్ పైకి వెళ్లనుంది. టాలీవుడ్ దర్శకుడు రమేష్ వర్మతో కాల భైరవ అనౌన్స్ మెంట్ వచ్చి నెలలు దాటిపోయింది. ఇది కాకుండా బులెట్ అనే సినిమా ఒప్పుకున్నాడు లారెన్స్. అదిగారం, హంటర్ లిస్టులో ఉన్న మరో రెండు. చూస్తుంటే రాబోయే మూడేళ్ళలో సంవత్సరానికి ఒకటి లేదా రెండు రిలీజులు లారెన్స్ నుంచి చూడొచ్చు.