త్రివిక్రమ్ అసలేం చేయబోతున్నారు

అల్లు అర్జున్ తో ప్లాన్ చేసుకున్న ఫాంటసీ మూవీ మొదలుపెట్టడానికి ఎక్కువ సమయం పట్టేలా ఉండటంతో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈలోగా ఒకటి రెండు సినిమాలు చేసే ప్రణాళికలో ఉన్నారు. అందులో భాగంగా మొదట వెంకటేష్ పేరు వినిపించింది. హారిక హాసిని బ్యానర్ లో వెంకీ మామ ఎప్పటి నుంచో ఒక కమిట్ మెంట్ బాకీ ఉన్నారు. దాన్ని ఈ రూపంలో తీర్చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ హఠాత్తుగా రామ్ చరణ్ ప్రాజెక్టు తెరమీదకొస్తోంది. వెంకటేష్ కన్నా ముందు మెగా పవర్ స్టార్ తోనే మాటల మాంత్రికుడు జత కట్టొచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన రెడీ అవుతోందట.

దీని వెనుక ఏం జరిగిందనే దాని మీద కొన్ని ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. పెద్ది అయ్యాక సుకుమార్ తో చేయాల్సిన సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులకు కనీసం ఏడాది సమయం అవసరమయ్యిందట. అప్పటిదాకా చరణ్ ఖాళీగా ఉండటం కష్టం. ఇంకోవైపు బన్నీ మూవీ లేట్ అవుతున్న కారణంగా ఎవరితో చేయాలనే మీమాంసను త్రివిక్రమ్ లో గమనించిన పవన్ కళ్యాణ్ స్వయంగా సలహా ఇచ్చి మరీ చరణ్ దగ్గరికి పంపినట్టు సన్నిహిత వర్గాల సమాచారం. ఈ కాంబో కోసం సితార ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నప్పటికీ ఫైనల్ గా ఇంకో కొత్త నిర్మాత భాగస్వామ్యంలో తెరకెక్కిస్తారని అంటున్నారు.

ఇదంతా స్పష్టంగా తేలడానికి ఇంకొంచెం సమయం పట్టేలా ఉంది. ఒకటి మాత్రం క్లియర్. త్రివిక్రమ్ ముందు చరణ్ తో చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఒకవేళ పెద్ది ఏదైనా కారణాల వల్ల ఆలస్యమైతే వెంకటేష్ ది స్టార్ట్ చేయొచ్చు. సుకుమార్ మాత్రం పుష్పని తలదన్నే స్క్రిప్ట్ సిద్ధం చేసే కార్యంలో బిజీగా ఉన్నారట. రంగస్థలంలో మించిన సినిమాని తమ నుంచి ఆశిస్తారు కాబట్టి దానికి ఏ మాత్రం తగ్గకుండా బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో పవర్ ఫుల్ సబ్జెక్టు తయారు చేస్తున్నారని తెలిసింది. ఏదైనా సందర్భంలోనో లేదా ఇంటర్వ్యూలోనో త్రివిక్రమ్ బయటికి వస్తే తప్ప ఈ సందేహాలన్నీ ఒక కొలిక్కి వచ్చేలా లేవు.