టాలీవుడ్ క్రేజీ క్లాష్ వద్దంటున్న బయ్యర్లు

రేపు అఖండ 2 తాండవం టీజర్ రాబోతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు అందులో విడుదల తేదీ సెప్టెంబర్ 25 ఉందట. షూటింగ్ ప్రారంభమైనప్పుడు ప్రకటించిన తేదీకే కట్టుబడుతున్నారు. ఇటీవలే ఓజి కూడా అదే డేట్ ని చెప్పేసుకుంది. అంటే బాలయ్య, పవన్ కళ్యాణ్ క్లాష్ తప్పకపోవచ్చు. అయితే బయ్యర్లు మాత్రం ఈ ఫేస్ ఆఫ్ ని కోరుకోవడం లేదు. ఎందుకంటే సంక్రాంతిలాగా దసరా పండగ భీభత్సమైన సీజన్ కాదు. సెలవులు ఉంటాయి కానీ సంక్రాంతి లాగా జనాలు నగరాలు వదిలి స్వంత ఊళ్లకు వెళ్లేంత సీన్ ఎక్కువగా ఉండదు. ఆ కారణంగానే రెండు పండగల మధ్య నమోదయ్యే నెంబర్లలో తేడా ఉంటుంది.

ఒకవేళ నిజంగా అఖండ 2, ఓజి కనక తలపెడితే ఒక్కో సెంటర్లో ఒక్కోలా ఒకరిమీద మరొకరి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. బిసి సెంటర్స్ లో బాలయ్య డామినేషన్ ఉండొచ్చు. నైజాం లాంటి ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ యుఫోరియా మాములుగా ఉండదు. చిన్న కేంద్రాల్లో రెండు మూడు స్క్రీన్లే అందుబాటులో ఉంటాయి. వాటిలో షోలు సర్దుబాటు చేయడం పెద్ద సమస్యగా మారుతుంది. సంక్రాంతికి మేనేజ్ చేయడం వేరు కానీ దసరాకి సీన్ మారిపోతుంది. 14 రీల్స్, డివివి ఎంటర్ టైన్మెంట్స్ వరస చూస్తుంటే ఎవరూ తగ్గేలా లేరని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. రేపు సాయంత్రం అఖండ 2 క్లారిటీ రానుంది.

ఒకవేళ కాంపిటీషన్ అనివార్యమైతే మాత్రం సీన్ రసవత్తరంగా మారిపోతుంది. కూటమి డిప్యూటీ సిఎం వర్సెస్ కూటమి ఎమ్మెల్యే పరస్పరం కవ్వించుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ క్షేత్ర స్థాయిలో ఈ దిశగా నిర్ణయం జరుగుతోందనే సంగతి పవన్ కళ్యాణ్, బాలయ్యలకు తెలుసో లేదోననే అనుమానాలు తలెత్తుతున్నాయి. అఖండ 2 షూటింగ్ కీలక దశకు చేరుకుంది. జార్జియా షెడ్యూల్ లో ముప్పాతిక శాతం పూర్తయినట్టేనని సమాచారం. ఓజిలో తన భాగం పవన్ ఫినిష్ చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. బోయపాటి శీను, సుజిత్ లు వేగం విషయంలో నువ్వా నేనాని పరుగులు పెట్టేలా ఉన్నారు.