మెగాస్టార్ భారీ ఫాంటసీ మూవీ విశ్వంభర అప్డేట్ కోసం అభిమానులు అరిచి గీపెడుతున్నా యువి క్రియేషన్స్ పట్టించుకోవడం లేదనే కామెంట్స్ ఓపెన్ గానే వినిపిస్తున్నాయి. మొదలుపెట్టినప్పుడు రెండు వందల కోట్ల ప్యాన్ ఇండియా మూవీ అని ఊదరగొట్టి తీరా ఫినిషింగ్ స్టేజికి వచ్చాక ఇంత మౌనం వహించడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. భోళా శంకర్ తర్వాత ఎక్కువ గ్యాప్ వచ్చినా సరే మంచి కంబ్యాక్ అవ్వాలనే ఉద్దేశంతో చిరంజీవి దీనికి ఎక్కువ సమయం కేటాయించారు. కేవలం ఒక్క సినిమా అనుభవమున్న వశిష్ఠని గుడ్డిగా నమ్మేశారు. తీరా చూస్తే విఎఫ్ఎక్స్ వల్ల ఆలస్యం అంతకంతా పెరుగుతోంది.
ఇప్పటికైతే విడుదల తేదీ గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం ఫ్యాన్స్ ఆందోళన పెంచుతోంది. ఒకపక్క మెగా 157 పరుగులు పెడుతోంది. అనిల్ రావిపూడి ఒక షెడ్యూల్ పూర్తి చేశాడు. రెండోది పక్కా ప్రణాళికతో రెడీ అవుతోంది. నవంబర్ కల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేసినా ఆశ్చర్యం లేదని యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట. దీని ప్రోగ్రెస్ ని ఎప్పటికప్పుడు బయటికి వచ్చేలా చూస్తున్న రావిపూడి ప్రమోషన్లలో తన ముద్ర ఆల్రెడీ మొదలుపెట్టేశాడు. నయనతార ఇంట్రో వీడియోతో అటు కోలీవుడ్ లోనూ హాట్ టాపిక్ అయ్యాడు. కానీ వశిష్ఠ మాత్రం పూర్తిగా వెనుకబడిబోయి అసలెక్కడ ఉన్నాడో అంతు చిక్కడం లేదు.
హరిహర వీరమల్లు సైతం ఇదే సమస్యతో బాధ పడుతున్నప్పటికీ నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ ఏదో ఒక రూపంలో బయట కనిపిస్తూ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకుంటున్నారు. ఫ్యాన్స్ నమ్మకం సడలిపోకుండా వీలైనంత మేర ప్రయత్నిస్తున్నారు. కానీ విశ్వంభర టీమ్ లో అది లోపించింది. ఇంకో డెబ్భై అయిదు రోజుల్లో చిరంజీవి పుట్టినరోజు వస్తోంది. కనీసం అప్పటికి ట్రైలరైనా వదలుతారా అనే విసుర్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. వీరమల్లుకి సంగీతం అందించిన కీరవాణే విశ్వంభరకు పాటలు ఇవ్వడం గమనార్హం. మ్యూజిక్ పరంగా రెండింటికి గొప్ప రెస్పాన్స్ రాకపోవడం ట్రాజెడీ.