నిజంగా లారెన్సే తీశాడా?


ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో ఇప్పటిదాకా రిలీజైన సినిమాల్లోకెల్లా అతి పెద్ద సినిమా అంటే.. ‘లక్ష్మి’నే అని చెప్పాలి. అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న కియారా అద్వానీ ఇందులో కథానాయికగా నటించింది. పెద్ద బడ్జెట్లో తీశారు. దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

ఐతే దీపావళి కానుకగా నిన్న రాత్రే హాట్ స్టార్‌లో రిలీజైన ఈ సినిమా అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. తొమ్మిదేళ్ల కిందట తమిళ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించి.. ఆ తర్వాత కన్నడ, బెంగాళీ భాషల్లో కూడా రీమేక్ అయి అక్కడ కూడా విజయం సాధించిన ‘కాంఛన’కు ‘లక్ష్మి’ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుందంటే ‘కాంఛన’ ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు. హిందీలో అక్షయ్ కుమార్, కియారా లాంటి తారాగణం సమకూరిన నేపథ్యంలో ఓ మాదిరిగా తీసినా కూడా ‘లక్ష్మి’కి అదిరిపోయే టాక్ వచ్చి ఉండాలి. కానీ ఈ చిత్రం హిందీలో చాలా సాదాసీదాగా తయారైంది.

లారెన్స్ ఒరిజినల్లో వీర లెవెల్లో కామెడీ పండిస్తే.. హిందీలో కామెడీ సీన్స్ అన్నీ తేలిపోయాయి. హిందు అమ్మాయి, ముస్లిం అబ్బాయి కాన్సెప్ట్‌తో కామెడీ చేయడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇక్కడ మాతృకలోని సన్నివేశాలను చాలా వరకు పక్కన పెట్టేసి బాలీవుడ్ స్టయిల్లో ఏదో ప్రయత్నించారు కానీ.. ఆ సన్నివేశాలన్నీ తేలిపోయాయి. హార్రర్ సన్నివేశాల్లో కూడా ఒరిజినల్లో ఉన్న ఇంపాక్ట్ మిస్సయింది. విలన్ పాత్ర కూడా అనుకున్నంతగా పేలలేదు. చివరి అరగంటలో మినహాయిస్తే ‘లక్ష్మి’ చాలా వరకు పేలవంగానే తయారైంది. ఒరిజినల్లో ఉన్న ‘షాక్’ ఫ్యాక్టర్ ‘లక్ష్మి’లో కనిపించలేదు.

ఎలాంటి అంచనాలు లేకుండా ‘కాంఛన’ను చూసి సౌత్ ప్రేక్షకులు సర్ప్రైజ్ అయితే.. ఎన్నో అంచనాలతో ‘లక్ష్మి’ని చూడటం కూడా మైనస్ అయినట్లుంది. ‘లక్ష్మి’ని చూసిన చాలా మందికి అసలీ సినిమా లారెన్సే తీశాడా అన్న సందేహాలు కలిగాయి. హిందీపై పట్టు లేని నేపథ్యంలో పేరుకే లారెన్స్‌ను దర్శకుడిగా పెట్టుకుని మొత్తం రైటింగ్, ప్రొడక్షన్ టీం మేకింగ్ చూసుకున్నట్లుంది. ఫలితంగానే ‘లక్ష్మి’ ఒరిజినల్ స్థాయిలో ఇంపాక్ట్ చూపించలేదని స్పష్టమవుతోంది.