భద్ర, తులసి చూడమని బోయపాటి బాలయ్యను అడిగితే..

నందమూరి బాలకృష్ణ కెరీర్ పాతాళానికి పడిపోయిన స్థితిలో ఆయన్ని మళ్లీ బలంగా పుంజుకునేలా చేసిన సినిమా ‘సింహా’. దాదాపు దశాబ్దం పాటు హిట్టు లేక అల్లాడిపోయిన బాలయ్య.. చివరికి 2010లో ఈ సినిమాతోనే పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా లేకపోతే బాలయ్య కెరీర్ ఏమై ఉండేదో ఏమో. మరి ఈ సినిమాకు ఎలా పునాది పడింది.. బాలయ్యను బోయపాటి కథతో ఎలా ఒప్పించాడు.. సినిమా చేస్తున్నపుడు బాలయ్య ఫీలింగ్ ఏంటి.. ఈ విషయాల్ని బోయపాటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ‘సింహా’కు 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో బోయపాటి ఈ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

‘భద్ర’, ‘తులసి’ సినిమాల తర్వాత మూడో సినిమా ఇంకా ఖరారు కాని సమయంలో తాను విజయవాడలో ఓ పెళ్లిలో ఉండగా బాలయ్య నుంచి కాల్ వచ్చినట్లు బోయపాటి వెల్లడించాడు. మరుసటి రోజు ఉదయానికల్లా హైదరాబాద్ చేరుకున్నానని.. ఆయన మనిద్దరం కలిసి సినిమా చేద్దాం అని చెప్పి లైన్ కోసం ఐదు రోజుల సమయం ఇచ్చారని.. ఐతే తాను రెండో రోజుకే ఆయన్ని కలిసి ‘సింహా’ లైన్ చెప్పానని బోయపాటి వెల్లడించాడు. ఐతే తాను చెప్పిన స్టోరీ కొత్తగా ఉండటంతో.. ఇదేంటి ఇలా ఉంది.. నా బాడీ లాంగ్వేజ్ గురించి మీకు తెలుసు కదా అన్నాడని.. ఐతే తాను కొంచెం కొత్తగా చేద్దామని బాలయ్యతో చెప్పానని బోయపాటి తెలిపాడు.

ఐతే ఇంతకుముందు చాలా మంది దర్శకులు కొత్తగా చేద్దాం అని చెప్పారని.. కానీ చివరికి రొటీన్‌గా తీశారని.. మరి నీ పరిస్థితేంటి అని బాలయ్య అన్నాడని.. ఐతే తన సినిమాలు ‘భద్ర’, ‘తులసి’ చూడమని బాలయ్యకు చెప్పానని.. కానీ ఆయన నేనా సినిమాలు చూడను, నీ మీద నమ్మకం ఉంది సినిమా చేద్దాం అన్నారని చెప్పాడు. ఇక సినిమా చేస్తుండగా.. మధ్య దశకు వచ్చేసరికే ఈ సినిమా పెద్ద రేంజికి వెళ్తుందని బాలయ్యకు నమ్మకం కలిగిందని.. మధ్యలో చిన్న బాలయ్య పాత్రకు బ్రేక్ ఇచ్చి ఫ్లాష్ బ్యాక్ సీన్లు నాన్ స్టాప్‌గా తీశామని.. అవి చేస్తున్నపుడే బాలయ్యకు సినిమా ఫలితం అర్థమైపోయిందని.. ఆయనకు సినిమా మీద చాలా మంచి జడ్జిమెంట్ ఉందని బోయపాటి అన్నాడు.