ఈ రోజుల్లో చిన్న సినిమాలకు సైతం వర్కింగ్ డేస్ పెరిగిపోతున్నాయి. ఇక కొంచెం స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సినిమా అంటే చాలు.. నెలలు నెలలు తీస్తూ పోతారు. పెద్ద సినిమా సంగతైతే చెప్పాల్సిన పని లేదు. సంవత్సరాలు గడిచిపోతాయి. తీరా చూస్తే అంత గొప్ప ఔట్ పుట్ ఏమీ కనిపించదు. సినిమాను వేగంగా పూర్తి చేస్తే బడ్జెట్లు ఎలా నియంత్రణలో ఉంటాయి, సినిమా క్లిక్ అయితే ఎంత మంచి లాభాలు వస్తాయన్నది ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి చిత్రాలు ఉదాహరణ. ఇప్పుడు రవితేజ కొత్త చిత్రానికి ఇదే సూత్రాన్ని పాటించబోతున్నట్లు సమాచారం.
నేను శైలజ, చిత్రలహరి లాంటి హిట్ మూవీస్ తీసి.. మధ్యలో కొంచెం డౌన్ అయిన కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. ఏ హడావుడి లేకుండా ఉన్నట్లుండి ఈ చిత్రాన్ని ప్రకటించారు. నేరుగా సంక్రాంతి రిలీజ్ అని పోస్టర్ మీద వేసేశారు కూడా. అనౌన్స్ చేసిన ఏడు నెలల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నెల 12న రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. ఈ సినిమాను ఒకప్పటి స్టయిల్లో సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయడానికి చిత్ర బృందం పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగుతోందట. జులై నెల చివరికల్లా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసేలా టైట్ షెడ్యూల్స్ మధ్య పని చేయబోతున్నారు.
స్క్రిప్టు పకడ్బందీగా రెడీ కావడం.. షూటింగ్ షెడ్యూళ్లు కూడా పక్కాగా ప్లాన్ చేయడంతో అనుకున్నట్లే షూట్ పూర్తి చేస్తామని చిత్ర బృందం ధీమాగా ఉంది. రవితేజ ఈ సినిమా కోసం బల్క్ డేట్లు ఇచ్చేశాడట. ఇక దర్శకుడు, నిర్మాత అనుకున్నట్లుగా షూట్ పూర్తి చేయడమే మిగిలింది. ముందు టాకీ పార్ట్ పూర్తి చేస్తే.. తర్వాత పాటల చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లు సాఫీగా చేసుకోవచ్చని అనుకుంటున్నారు. ప్లాన్ ప్రకారం అన్నీ జరిగితే ఈ సినిమా ఒక రోల్ మోడల్‌గా మారే అవకాశముంది. ఈ చిత్రాన్ని ‘దసరా’ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.