మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న బిగ్ డే వచ్చేసింది. కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కలయికలో రూపొందిన థగ్ లైఫ్ ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. కర్ణాటక భాషకు సంబంధించి కమల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో నిషేధం విధించడంతో దీని మీద ఫోకస్ మరింత పెరిగింది. నాయకుడు లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ వచ్చిన 38 సంవత్సరాల తర్వాత రిపీటైన కాంబో కావడంతో అభిమానుల్లో ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ విక్రమ్ స్థాయిలో లేకపోయినా ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాల పరంగా ఎక్కువ ట్రెండ్ అయిన మూవీ ఇదేనని చెప్పాలి.
యుఎస్ ప్రీమియర్ల నుంచి మిశ్రమ స్పందన వినిపిస్తున్న నేపథ్యంలో ఇండియా టాక్ ఎలా ఉండబోతోందనేది కీలకం కాబోతోంది. తెలుగు వరకు ఏమంత బజ్ కనిపించకపోవడం కొంత ఆందోళన కలిగించే విషయమే కానీ విక్రమ్ లాగా రెస్పాన్స్ వస్తే అమాంతం పికప్ చూడొచ్చు. పైగా బాక్సాఫీస్ ఖాళీగానే ఉంది. చెప్పుకోదగ్గ పోటీ లేదు. ఈ అవకాశాన్ని వాడుకుంటే భారీ వసూళ్లు చూడొచ్చు. మూడు దశాబ్దాల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ కమల్ మణిరత్నం కలవడం బాగుంది కానీ ఇంత అంచనాలను ఏ మేరకు తట్టుకుంటుందనేది వేచి చూడాలి. ఏఆర్ రెహమాన్ సంగీతం కోసం చూస్తున్న ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు.
కర్ణాటక వివాదంలో క్షమాపణ చెప్పకుండా చాలా దూరం తీసుకెళ్లిన కమల్ హాసన్ కు ఆ రాష్ట్రంలో బ్యాన్ కావడం వల్ల జరిగిన నష్టం వాళ్ళకేనని నిరూపించాలంటే ఇది బ్లాక్ బస్టర్ కావాలి. లేదంటే రివర్స్ లో ట్రోలింగ్ లాంటివి చవి చూడాల్సి రావొచ్చు. త్రిష, అభిరామి, శింబు, అశోక్ సెల్వన్, నాజర్ లాంటి క్యాస్టింగ్ హైప్ ని పెంచింది. టైటిల్ ఇంగ్లీష్ లో ఉండటం వల్ల మాస్ వర్గాలకు త్వరగా రీచ్ కాలేకపోవడం కొంత ప్రభావాన్ని చూపిస్తున్న మాట వాస్తవం. భారతీయడు 2 దారుణమైన డిజాస్టర్ తర్వాత మరో సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న కమల్ హాసన్ కు థగ్ లైఫ్ ఏ మేరకు ఊరటనిస్తుందో చూడాలి.