ముగ్గురు హీరోలకు కంబ్యాక్ ఇస్తుందని భావించిన భైరవం ఆశించిన స్థాయిలో దూకుడు చూపించలేకపోతున్న వైనం వసూళ్లలో కనిపిస్తోంది. మొదటి రెండు రోజుల ఖలేజా రీ రిలీజ్ వల్ల ప్రభావితం చెందినప్పటికీ తర్వాతైనా పికప్ చూపించాల్సింది. అయితే యునానిమస్ టాక్ రాకపోవడం కలెక్షన్లను ప్రభావితం చేస్తోంది. దీనికి తోడు ఐపీఎల్ క్వాలిఫయ్యర్, ఫైనల్ మ్యాచులు వీకెండ్ తో పాటు వీక్ డేస్ సాయంత్రం, సెకండ్ షోల మీద దెబ్బ కొట్టాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం భైరవం టార్గెట్ గ్రాస్ ముప్పై కోట్ల దాకా ఉంది. కానీ మొదటి వారం పూర్తయ్యే సమయానికి పది కోట్ల మార్కునే చేరుకుందని అంటున్నారు.
అంటే లక్ష్యం ఇంకా పెద్దదే ఉంది. కంటెంట్ పరంగా మాస్ అంశాలు ఉన్నప్పటికీ గరుడన్ ని యధాతథంగా తీయడం, అవసరం లేని కామెడీని ఫస్ట్ హాఫ్ లో జొప్పించడం, మంచు మనోజ్ బాగా నటించినా అతను విలన్ కావడం, హీరోయిన్ అదితి శంకర్ మైనస్ కావడం లాంటి కారణాలు పబ్లిక్ టాక్ ని ఎఫెక్ట్ చేశాయి. ఇలాంటి సినిమాలు రెండో రోజుకే టాక్ లో మార్పు చూపించాలి. లేకపోతే లేవడం కష్టం. నిజానికి థియేటర్లలో చెప్పుకోదగ్గ పోటీ ఏదీ లేదు. భైరవం కనక బాగుందని అనిపించుకుని ఉంటే ఇవాళ లెక్కలు వేరుగా ఉండేవి. ఒక రకంగా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టేనని ఫిగర్లు చెబుతున్న వాస్తవం.
రేపు థగ్ లైఫ్ తో పాటు బద్మాష్ లాంటి మరికొన్ని చిన్న సినిమాలు బరిలో దిగుతున్నాయి. అన్నీ టాక్ మీద ఆధారపడినవే. కమల్ హాసన్ మణిరత్నం కలయిక మన ప్రేక్షకులను ఎగ్జైట్ చేయడం లేదు. సో ఓపెనింగ్స్ మరీ భారీగా రాకపోవచ్చు. సో భైరవం కనక సెకండ్ వీక్ లో పుంజుకుంటే బ్రేక్ ఈవెన్ ఛాన్సులు కొంత మేర పెరుగుతాయి. కానీ అంత గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి. ప్రమోషన్లు అయితే కొనసాగిస్తున్నారు. అల్లుడు అదుర్స్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటన పరంగా ఓకే కానీ రిజల్ట్ పరంగా మాత్రం తాను ఆశించిన అద్భుతం జరగడం అనుమానమే.