బలగంతో సూపర్ హిట్ అందుకున్నాక ప్రియదర్శి కెరీర్ ఒక హిట్టు ఒక ఫ్లాపుతో దివ్యంగా సాగుతోంది. డార్లింగ్ నిరాశపరిస్తే కోర్ట్ ఏకంగా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న సారంగపాణి జాతకం అంచనాలు అందుకోలేక చతికిలబడటం ఊహించనిది. ఫలితాల సంగతి ఎలా ఉన్నా కంటెంట్ బేస్డ్ మూవీస్ కి ప్రియదర్శి బెస్ట్ ఆప్షన్ అవుతున్న వైనం ఇండస్ట్రీలో కనిపిస్తోంది. హీరోయిజం, కమర్షియల్ ఎలిమెంట్స్ అవసరం లేని వైవిధ్య భరిత సినిమాలకు తనే మంచి ఛాయసవుతున్నాడు. శ్రీవిష్ణు మిస్సవుతున్న వాళ్ళు తనను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రియదర్శికి మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ దొరికేసింది.
గీతా ఆర్ట్స్ 2 బాధ్యతల నుంచి బ్రేక్ తీసుకున్న నిర్మాత బన్నీ వాస్ స్వంతంగా తన పేరు మీద బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్ మొదలుపెట్టి అందులో మొదటి సినిమాగా ఓ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించబోతున్నాడు. దీనికి మిత్రమండలి టైటిల్ ని ఫిక్స్ చేశారని సమాచారం. బన్నీ వాస్ తో పాటు హాయ్ నాన్న ఫేమ్ ఐరా ఎంటర్ టైన్మెంట్స్ , సప్త అశ్వ క్రియేషన్స్ నిర్మాణ భాగస్వాములుగా ఉండబోతున్నాయి. మిత్రమండలి పేరుని బట్టి చూస్తే ఇదేదో స్నేహితుల బ్యాక్ డ్రాప్ లో జరిగే పూర్తి వినోదాత్మక చిత్రంగా అనిపిస్తోంది. నవ్వించడమే లక్ష్యంగా రూపొందే ఈ మూవీకి ఎస్ విజయేంద్రని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు.
ఎల్లుండి దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. భలే భలే మగాడివోయ్ నుంచి ఆయ్, తండేల్ దాకా తన అభిరుచిని చాటుకుంటూ వచ్చిన బన్నీ వాస్ ఇప్పుడీ మిత్రమండలితో వేయబోయే కొత్త అడుగు అదే దారిలో ఉంటుందని సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. ఏది ఏమైనా మీడియం కన్నా కొంచెం తక్కువ బడ్జెట్ ఉండే కంటెంట్ సినిమాలను ప్రియదర్శి ఎంచుకుంటున్న తీరు చూస్తే కెరీర్ ఇప్పుడు సరైన దారిలో వెళ్తోందనిపిస్తోంది. ఇంకో రెండు మూడు హిట్లు పడితే మార్కెట్ కూడా పెరుగుతుంది. మిత్రమండలికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం సమకూర్చబోతున్నారు.