నేను చేస్తే పెద్ద హిట్టయ్యేది కాదు-నారా రోహిత్

ఒక కథ ఒక కాంపౌండ్‌లో అడుగు పెట్టి.. తర్వాత ఎక్కడెక్కడికో వెళ్లి చివరగా ఒక చోట పట్టాలెక్కుతుంది. ఇలా చేతులు మారిన కథలు అద్భుత ఫలితాన్నీ అందుకుంటాయి. అలాగే చేదు అనుభవాన్నీ మిగులుస్తాయి. అలా చేతులు మారిన కథల్లో ‘గీత గోవిందం’ కూడా ఒకటి. నారా రోహిత్‌తో ‘సోలో’ సినిమా తీసి హిట్టు కొట్టిన దర్శకుడు పరశురామ్.. తన తర్వాతి చిత్రాన్ని కూడా అతడితోనే చేయాలనుకున్నాడట.

అందుకే ‘గీత గోవిందం’ కథను ముందు రోహిత్‌కే చెప్పాడట. కానీ తర్వాతేమో విజయ్ దేవరకొండతో ఆ చిత్రం చేశాడు. అది ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురి చేసింది. తాను ఈ సినిమాను మిస్సవడం గురించి ఓ ఇంటర్వ్యూలో రోహిత్ స్పందించాడు. తాను చేస్తే ‘గీత గోవిందం’ అంత పెద్ద హిట్టయ్యేది కాదని అతను నిజాయితీగా అంగీకరించడం విశేషం.

‘గీత గోవిందం’ కథ నచ్చి తన సొంత బేనర్లోనే ఆ సినిమా చేయాలని అనుకున్నట్లు రోహిత్ వెల్లడించాడు. కానీ తర్వాత ఆ కథ గీతా ఆర్ట్స్ సంస్థ వద్దకు వెళ్లిందని.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండను హీరోగా అనుకున్నారని.. పరశురామ్‌కు అది ఇంకా పెద్ద బ్రేక్ ఇస్తుందన్న ఉద్దేశంతో అక్కడే ఆ సినిమా చేయడానికి తాను ఓకే చెప్పానని రోహిత్ వెల్లడించాడు. తాను గనుక ఆ సినిమా చేసి ఉంటే.. మహా అయితే 15 కోట్లు వసూలు చేసేదని.. విజయ్‌తో అయినంత పెద్ద హిట్ అయ్యేది కాదని రోహిత్ అభిప్రాయపడ్డాడు.

ఇక తన చివరి చిత్రం ‘ప్రతినిధి-2’ గురించి మాట్లాడుతూ.. అది మిస్ ఫైర్ అయిందన్నాడు రోహిత్. ఎన్నికల సీజన్‌ను క్యాష్ చేసుకుందామనే ఆ సినిమా తీశామని.. కానీ అది జనాలకు రీచ్ కాలేదని అన్నాడు. రాంగ్ టైమింగ్‌లో రిలీజ్ కావడం దానికి చేటు చేసిందన్నాడు. ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు విడుదల చేశామని.. దీంతో ఆ చిత్రం రిలీజైనట్లు కూడా జనాలకు తెలియలేదని.. అలా కాకుండా నెలా రెండు నెలల ముందు రిలీజై ఉంటే.. కనీసం తాము ఏం తీశామో జనాలకు తెలిసేదని.. ఆ సినిమా చేసిన ఉద్దేశమే నెరవేరలేదని రోహిత్ అన్నాడు.