తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టిందంటూ తమిళ సీనియర్ హీరో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. కమల్ చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు మండిపడుతున్నారు. కమల్ క్షమాపణలు చెప్పాలని కన్నడ భాషా పండితులతో పాటు చరిత్రకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను ప్రేమతో ఆ వ్యాఖ్యలు చేశానని, ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పదని కమల్ అన్నారు. ఈ కామెంట్లు ఆ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.
ఈ క్రమంలోనే కమలహాసన్ నటించిన చిత్రం థగ్ లైఫ్ విడుదలను అడ్డుకుంటామని కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ క్రమంలోనే కమలహాసన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంత పెద్ద స్టార్ అయినా ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు కమలహాసన్ కు లేదని కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక క్షమాపణ చెబితే అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేవని కమల్ కు హితవు పలికింది.
ప్రజాప్రతినిధిగా, నటుడిగా కమల్ అటువంటి ప్రకటన చేయకూడదని హైకోర్టు అభిప్రాయపడింది. ఏ ప్రాతిపదికన కమల్ హాసన్ ఆ ప్రకటన చేశారని ప్రశ్నించిన కోర్టు…కమల్ హాసన్ ఏమైనా చరిత్రకారుడా లేక భాషావేత్తా అని నిలదీసింది. కమల్ హాసన్ కామెంట్స్ వల్ల కన్నడ నాట అశాంతి ఏర్పడిందని, కమల్ హాసన్ అయినా, మరెవరైనా ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదని తేల్చి చెప్పింది.
క్షమాపణ చెప్పే ఉద్దేశం లేని పక్షంలో కర్ణాటకలో ఆ సినిమాను ఎందుకు ప్రదర్శించాలనుకుంటున్నారని ప్రశ్నించింది. మరో రెండు రోజుల్లో సినిమా విడుదల ఉన్న నేపథ్యంలో కమల్ క్షమాపణలు చెబుతారా లేదా? కర్ణాటకలో థగ్ లైఫ్ విడుదలవుతుందా లేదా అన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది.
ఈ లోపే కమల్ డైరెక్ట్ గా క్షమాపణలు లేకుండా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. కర్ణాటక ప్రజలు తన మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారని, అన్ని భాషలు ఒక కుంటుం అని చెప్పడమే తన ప్రయత్నమని కమల్ అందులో చెప్పుకొచ్చారు. కన్నడ భాషపై తనకు ఎప్పుడూ ప్రేమ ఉంటుందని చెప్పారు. మరి దీనిపై కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.