రాజా సాబ్ రిలీజ్…స్ట్రాటజీ అదిరిపోయింది

హమ్మయ్యా అనుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ది రాజా సాబ్ విడుదల ఎప్పుడు ఉంటుందా అనే సస్పెన్స్ కు తెరదించుతూ డిసెంబర్ 5 థియేటర్లకు రాబోతోందని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ముందు డిసెంబర్ 12 అనే ప్రచారం జోరుగా జరిగింది. యూనిట్ వర్గాలు ఈ దిశగానే లీక్స్ ఇచ్చాయి. కానీ గంటల వ్యవధిలో నెంబర్ మారిపోయి ఇప్పుడు సరిగ్గా పుష్ప 2 ది రూల్ తేదీని తీసుకుని తెలివైన ఎత్తుగడ వేశారు. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే సంక్రాంతి దాకా ఎంతలేదన్నా నెల రోజుల బలమైన రన్ దక్కుతుంది. వెయ్యి కోట్లను రెండు వారాల్లోపే దాటించవచ్చని అల్లు అర్జున్ ఆల్రెడీ నిరూపించాడు.

ఒకవేళ సెప్టెంబర్ మిస్ అయితే డిసెంబర్ వైపు చూస్తోందని అఖండ 2 గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజా సాబ్ ముందడుగు వేసి కర్చీఫ్ వేయడం తెలివైన నిర్ణయం. ఎందుకంటే డిసెంబర్ 25 అడివి శేష్ డెకాయిట్ లాక్ చేసుకుంది. అదే రోజు అలియా భట్ ఆల్ఫా వస్తోంది. ఈ రెండు ప్రభాస్ రేంజ్ సినిమాలు కాకపోయినా బాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుంటే ప్రభాస్ కు సోలో రిలీజ్ చాలా అవసరం. బాహుబలి నుంచి కల్కి దాకా ఇదే స్ట్రాటజీ ఫాలో కావడం వల్ల మంచి ఫలితాలు దక్కాయి. సాహో, రాధే శ్యామ్, ఆది పురుష ఫెయిలైనా వసూళ్ల పరంగా డీసెంట్ నెంబర్లు తీసుకొచ్చాయి.

ఇప్పుడు ది రాజా సాబ్ అదే బాటలో వెళ్లడం కలెక్షన్ల పరంగా ప్లస్ అవుతోంది. సరే చెప్పడం వరకు బాగానే ఉంది కానీ వీలైనంత త్వరగా బ్యాలన్స్ షూటింగ్ పూర్తి చేయడం దర్శకుడు మారుతీ ముందున్న తక్షణ కర్తవ్యం. తమన్ కొత్త పాటలను ఇంకా షూట్ చేయాల్సి ఉంది. సంజయ్ దత్ తో ఇటీవలే కొత్త షెడ్యూల్ ఒకటి చేశారు. నిది అగర్వాల్ ఆందుబాటులో ఉంది కానీ మాళవిక మోహనన్ డేట్లు లాక్ చేసుకుని సాంగ్స్ సంగతి చూస్తే ఒక టెన్షన్ తగ్గిపోతుంది. పుష్ప 2, యానిమల్, అఖండ లాంటి ఇండస్ట్రీ హిట్లు డిసెంబర్ మొదటి వారంలోనే వచ్చాయి. మరి రాజా సాబ్ కూడా అదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తుందేమో చూడాలి.