‘వీరమల్లు’.. ఇంత హడావుడంటే కష్టమే

సంక్రాంతికి భారీ చిత్రాలు పలకరించాక.. ఆ స్థాయి సినిమాలు లేక తెలుగు ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎట్టకేలకు ఈ నెల రెండో వారంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ రాబోతోంది. పవన్ కెరీర్లోనే అత్యధిక కాలం షూటింగ్ దశలో ఉండి, చాలా ఆలస్యంగా రిలీజవుతున్న సినిమా ఇది. ఒక దశలో ఈ సినిమా రిలీజవుతుందా లేదా అనే సందేహాలు కూడా కలిగాయి.

ఐతే ఏడాదిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా, కొన్ని శాఖల మంత్రిగా బాధ్యతలను మోస్తున్న పవన్.. అతి కష్టం మీద వీలు చేసుకుని సినిమాను పూర్తి చేయడంతో రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. ఐతే సినిమా చాలా ఆలస్యం కావడం వల్ల పవన్ గత చిత్రాలకు ఉన్న హైప్ దీనికి లేని మాట వాస్తవం. రిలీజ్ దగ్గర పడుతుండగా హైప్ పెంచడానికి సరైన ప్రయత్నాలు కూడా జరగట్లేదనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది. ఎలాగూ పవన్ వచ్చి సినిమాను ప్రమోట్ చేయడు. ఈ నేపథ్యంలో ఎగ్జైటింగ్ ప్రోమోలు రిలీజ్ చేసి హైప్ పెంచాలని కోరుకుంటున్నారు. అన్నింటికీ మించి స్ట్రైకింగ్ ట్రైలర్ కోసం చూస్తున్నారు.

ఐతే విడుదలకు పది రోజులే మిగిలి ఉన్నా.. ఇంకా ట్రైలర్ రాలేదు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో నిర్మాత ఏఎం రత్నంను అడిగితే.. సినిమాలో ద్వితీయార్ధానికి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నాయని.. అవి పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక కొలిక్కి వస్తే కానీ ట్రైలర్ రిలీజ్ చేయలేమని అన్నారు. ఐతే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన సినిమాకు పది రోజుల ముందు ఇంకా వీఎఫెక్స్ పనులు జరగడమేంటి, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవడం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

ఇంత హడావుడిగా ఆ పనులు చేస్తే సినిమా ఔట్ పుట్ మీద ప్రభావం పడదా అంటున్నారు. ఇంకా ఆ పనుల్లో బిజీగా ఉంటే.. ఇక ట్రైలర్ మీద ఎలా దృష్టిపెడతారని ప్రశ్నిస్తున్నారు. ట్రైలర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దితే తప్ప సినిమాకు హైప్ పెరగదని.. ప్రస్తుత పరిస్థితుల్లో హడావుడిగా ట్రైలర్ కట్ చేసి వదిలితే అది ఓపెనింగ్స్ మీద ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని.. అభిమానులు కంగారు పడుతున్నారు. ఇప్పుడు ట్రైలర్ చాలా కీలకం. అది వస్తేనే లెక్కలు మారే అవకాశాలు ఉన్నాయి.