కర్ణాటకలో ఏకంగా సినిమా బ్యాన్ అయ్యేదాకా వెళ్లిన కమల్ హాసన్ కన్నడ భాష కామెంట్ల వ్యవహారం ఎటుపోయి ఎటు దారి తీస్తుందో అంతు చిక్కడం లేదు. థగ్ లైఫ్ తమ రాష్ట్రం థియేటర్లలో ప్రదర్శించే ప్రసక్తే లేదని ఫిలిం ఛాంబర్, రాజకీయ నాయకులందరూ ఏకతాటిపైకి రావడంతో జూన్ 5 కమల్ కన్నడ ఫ్యాన్స్ కి ఈ మూవీ చూసే ఛాన్స్ లేనట్టే. లోకనాయకుడు క్షమాపణ చెప్పే ఉద్దేశంలో లేకపోవడం వివాదాన్ని మరింత పెద్దదిగా మారుస్తోంది. కన్నడనాట నిరసన ప్రదర్శనలు, దిష్టి బొమ్మ దహనాలు, ధర్నా, ప్రెస్ మీట్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమల్ కు మద్దతుగా ఎవరుంటారనే ప్రశ్న తలెత్తడం సహజం.
ప్రస్తుతం కోలీవుడ్ హీరో హీరోయిన్లు, దర్శకులు, సాంకేతిక నిపుణులు అందరూ ఈ విషయంగా మౌన వ్రతం పాటిస్తున్నారు. కమల్ కు సంఘీభావంగా నడిగర్ సంఘం నుంచి ఒక లేఖ విడుదలయ్యింది కానీ వ్యక్తిగతంగా ఏ ఆర్టిస్టు దీన్ని ఖండిస్తూ పేపర్ స్టేట్ మెంట్ ఇవ్వడం కానీ మీడియా ముందుకు రావడం కానీ చేయలేదు. కనీసం ట్వీట్లు పెడుతున్న దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే ఇప్పుడు కమల్ కి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళ సినిమాల రిలీజ్ టైంకి శాండల్ వుడ్ లో ఇబ్బందులు వచ్చేలా ఉన్నాయి. లేనిపోని గొడవలు వస్తాయి, ఎందుకొచ్చిన తలనెప్పి లెమ్మని సైలెంట్ గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు.
నిజానికి కమల్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. తన మాటలకు కట్టుబడి నో సారీ అంటున్నారు. తమిళం నుంచి కన్నడ ఎలా పుట్టిందో చెబితే వివాదం ఆగొచ్చు. కానీ ఆ ఆధారాలు తన దగ్గర ఉన్నాయని అనుకోలేం. ఇంకో నాలుగు రోజుల్లో రిలీజ్ పెట్టుకుని ఇదంతా బయ్యర్లకు శిరోభారంగా మారింది. ఈ కాంట్రవర్సి వల్ల కనీసం పాతిక కోట్ల దాకా నష్టం వాటిలవచ్చని ఒక అంచనా. దానికీ కమల్ హాసన్ సిద్ధపడినట్టే కనిపిస్తోంది. ఆయనకు ఫ్యాన్ అన్న పాపానికి శివరాజ్ కుమార్ కూడా ఈ ఇష్యూలో నలిగిపోతున్నారు. థగ్ లైఫ్ ఘటనకు నిరసనగా కన్నడ సినిమాలను తమిళనాడులో నియంత్రించే ఆలోచన కోలీవుడ్ లో జరుగుతోందట.
Gulte Telugu Telugu Political and Movie News Updates