=

కన్నప్ప హార్డ్ డిస్క్ ఘటన : విష్ణు చెప్పిన ట్విస్టులు

ఇటీవలే కన్నప్ప హార్డ్ డిస్క్ మాయమయ్యిందంటూ వచ్చిన వార్త ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు సోషల్ మీడియాలో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. అంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన కంటెంట్ కొరియర్ లో పంపడం ఏమిటంటూ ఫ్యాన్స్ షాక్ తిన్నారు. అయితే దీనికి సంబంధించిన వివరణ అడిగేందుకు మంచు విష్ణు టాలీవుడ్ మీడియాకు అందుబాటులోకి రాలేదు. ఇవాళ చెన్నైలో జరిగిన ఈవెంట్ లో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకున్నాడు. ఫ్యామిలీ సంగతులు వద్దంటూ అసలు హార్డ్ డిస్క్ చోరీ వెనుక ఏం జరిగింది, ఎవరెవరు ఉండొచ్చనే కోణం ఎక్స్ ప్లయిన్ చేశాడు. ఆ సారాంశం చూద్దాం.

కన్నప్ప డిజిటల్ వెర్షన్ మూడు కాపీలను హాలీవుడ్ స్టూడియోలో, మరో రెండు హైదరాబాద్ లో భద్రపరిచారు. స్థానికంగా ఉన్న కాపీలు ఒకటి డిఐ టెక్నీషియన్, మరొకటి ఆఫీస్ కోసం పంపుతారు. సేఫ్టీ బ్యాకప్ చేసుకోవడం అందరూ చేసేదే. కన్నప్ప విఎఫ్ఎక్స్ మొత్తం ఎనిమిది కంపెనీలు చూస్తున్నాయి. విదేశాల్లో రెండు ఉండగా హైదరాబాద్, ముంబై, చెన్నై కలిపి మూడున్నాయి. డిస్క్ పోయిన వార్త   విష్ణు ద్వారా బయటికి రాలేదు. పోలీస్ కంప్లయింట్ ఇచ్చాక అక్కడి నుంచి రిపోర్టర్ కు వేరే మార్గంలో సమాచారం అందింది. మాములుగా ముంబైలో పూర్తయిన వర్క్ ని ప్రసాద్ ల్యాబ్స్ లో డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు.

కానీ ఓసారి ఇబ్బంది ఎదురు కావడంతో ముంబై కంపెనీ ఆ సన్నివేశాలను ఒక డిస్క్ లో పొందుపరిచి కొరియర్ చేసింది. మాములుగా వీటికి రెండు అడ్రెస్ ఇస్తారు. ఒకటి ఆఫీస్, మరొకటి మోహన్ బాబు ఇల్లు. 15 సంవత్సరాలుగా ఇదే ఫాలో అవుతున్నారు. అయితే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి కొరియర్ వచ్చినప్పుడు రఘు అనే వ్యక్తి తీసుకుని చరితకు ఇచ్చాడు. వాళ్లిద్దరూ ఉద్యోగులు కాదు. కానీ మనోజ్ దగ్గర పని చేస్తున్నారో లేదో విష్ణుకి తెలియదు. 70 నిమిషాల ఫుటేజ్ అందులో ఉండటం షాక్ కలిగించే విషయం. పాస్ వర్డ్ ఉన్న ఈ డేటాని 99 శాతం క్రాక్ చేయలేరు. కానీ వన్ పర్సేంట్ ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఆందోళన సహజం.

సో ఇదంతా మంచు విష్ణు చెప్పిన హార్డ్ డిస్క్ వెనుక కథ. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏవైనా లీక్స్ వచ్చినా దయచేసి చూడొద్దని చెబుతున్న విష్ణు జూన్ 27 బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తానని హామీ ఇస్తున్నాడు. ప్రతిదీ పరిశోధన చేసి సినిమాలో పెట్టామే తప్పించి శివుడిని అవమానించే ఉద్దేశం ఎంత మాత్రం లేదని పలు ప్రశ్నలకు సమాధానంగా చెప్పాడు. త్వరలోనే దోషులను పట్టుకుని దాని వెనుక ఎవరున్నారో కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నామని, కానీ చెడ్డపేరు తెచ్చేది రక్త సంబంధీకులైనా సరే వదిలిపెట్టే సమస్యే లేదని విష్ణు తేల్చి చెప్పాడు. చూడాలి రాబోయే రోజుల్లో ఈ పరిణామాల్లో ఇంకెలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో.