ధనుష్‌తో రజినీ బయోపిక్?

పుట్టిందేమో మహారాష్ట్రలో. ఉద్యోగం చేసిందేమో బెంగళూరులో. సినీ హీరోగా ప్రస్థానం మొదలుపెట్టి తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగిందేమో తమిళనాడులో. ఇలా సూపర్ స్టార్ రజినీకాంత్ జీవిత ప్రస్థానం ఎన్నో మలుపులతో కూడుకున్నది. సినిమాల్లో విలన్‌గా మొదలుపెట్టి.. దేశవిదేశాల్లో అసాధారణ ఫాలోయింగ్ తెచ్చుకుని అసలు సిసలైన సూపర్ స్టార్‌గా రజినీ ఎదిగిన వైనం అబ్బురపరిచేదే.

వ్యక్తిగా కూడా రజినీ ప్రత్యేకతలు ఎన్నో. మిగతా స్టార్ల లాగా ఆయన బయట కూడా మేకప్ వేసుకోరు. చాలా సింపుల్‌గా ఉంటారు. అతి సామాన్యుడిలా హిమాలయాలకు వెళ్లి ప్రశాంతంగా గడిపి వస్తారు. ఎప్పుడూ వినమ్రంగా మాట్లాడతారు. అణకువ ప్రదర్శిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే రజినీలో ప్రత్యేకతలు ఎన్నో. మొత్తంగా ఆయన జీవిత కథను వెండితెర మీదికి తీసుకొస్తే ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగే అవకాశముంది.

కోలీవుడ్లో అలాంటి ప్రయత్నమే జరుగుతున్నట్లు సమాచారం. సీనియర్ దర్శకుడు లింగుస్వామి రజినీ బయోపిక్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఒకప్పుడు రన్, పందెంకోడి, వేట్టై లాంటి బ్లాక్‌బస్టర్లు తీసిన లింగుస్వామి కొన్నేళ్లుగా స్థాయికి తగ్గ సినిమాలు చేయలేదు. చివరగా అతను తీసిన ‘పందెం కోడి-2’ కూడా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత రెండేళ్లుగా అతను ఖాళీగా ఉంటున్నాడు. ఈ సమయంలో అతను రజినీ బయోపిక్ మీదే వర్క్ చేస్తున్నాడట. స్క్రిప్టు చివరి దశకు వచ్చిందని.. రజినీ పాత్రలో ఆయన అల్లుడు ధనుష్ అయితే బాగుంటుందని అతను భావిస్తున్నాడట.

ఈ విషయమై రజినీ కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నాడట. రజినీ కుటుంబాన్ని సంప్రదించకుండా బయోపిక్ వర్క్ మొదలుపెట్టే అవకాశమే లేదు కాబట్టి.. దీనికి ముందే వాళ్ల ఆమోదం ఉండి ఉంటుంది. లేకుంటే ఇప్పుడిలా వార్తలు బయటికి వచ్చేవి కూడా కావు. నటుడిగా తనేంటో రుజువు చేసుకుని పెద్ద స్టార్ అయ్యాకే ధనుష్ రజినీ ఫ్యామిలీలోకి వచ్చాడు. అప్పుడప్పుడూ తన సినిమాల్లో రజినీని అతను భలేగా ఇమిటేట్ చేస్తుంటాడు. తన మామలా మేకోవర్ సాధించి ఆయన బయోపిక్‌లో ధనుష్ నటిస్తే, సినిమా బాగా తీస్తే ఇదో సెన్సేషన్ అయ్యే అవకాశముంది.