మంచు మనోజ్ కనక అర్జున్ రెడ్డి చేసుంటే

భైరవం ప్రమోషన్ల సందర్భంగా మంచు మనోజ్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటున్నాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అర్జున్ రెడ్డి కథ ముందు తన వద్దకే వచ్చిందని, కొద్దిరోజులు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రయాణం చేశానని, కానీ మెటీరియలైజ్ కాలేకపోయిందని చెప్పుకొచ్చాడు. నిజంగా ఇది షాక్ ఇచ్చే పాయింట్. ఒకవేళ మనోజ్ నిజంగానే ఓకే చెప్పి ఆ పాత్రలో కనిపించి ఉంటే ఎలా ఉండేదని ఊహించుకోవడం కష్టం. అంత బోల్డ్ క్యారెక్టర్ విజయ్ దేవరకొండ అగ్రెసివ్ గా చేయడం వల్ల అంత గొప్పగా పండింది. అందులోనూ తనది కొత్త మొహం కావడంతో ఆ హీరోయిజంకి ప్రేక్షకులు కనెక్టయ్యారు.

కానీ మంచు మనోజ్ కు అలా కాదు. అర్జున్ రెడ్డి టైంకి తన మీద ఆడియన్స్ లో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఏదో డిఫరెంట్ గా ట్రై చేస్తాడనే అభిప్రాయం ఉంది. పైగా కరెంట్ తీగ, గుంటూరోడు లాంటి మాస్ సినిమాలతో ఆ వర్గానికి దగ్గరయ్యాడు. అలాంటప్పుడు విపరీత ప్రవర్తన కలిగిన మెడికల్ స్టూడెంట్ గా అంతగా నప్పేవాడు కాదేమో. పెర్ఫార్మన్స్ పరంగా బెస్ట్ ఇచ్చినా అలాంటి క్యారెక్టర్ లో చూసేందుకు ఫ్యాన్స్ రెడీగా లేనప్పుడు ఆడియన్స్ రిసీవ్ చేసుకోరు. ఉదాహరణకు డాడీని చిరంజీవి కాకుండా వెంకటేష్ చేసి ఉంటే హిట్టయ్యేదని స్వయంగా వాళ్లిద్దరే ఒప్పుకున్న వైనాన్ని గుర్తు చేసుకోవచ్చు.