ఇంకో రిస్కుకి వరుణ్ తేజ్ సిద్ధం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న వరుణ్ తేజ్ బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు .తనవరకు శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నప్పటికీ విజయం మాత్రం అందని ద్రాక్షగా మారిపోయింది. తొలిప్రేమ, ఫిదా స్థాయి బ్లాక్ బస్టర్ దక్కి సంవత్సరాలు గడిచిపోయాయి. కనీసం గద్దలకొండ గణేష్ లాంటి డీసెంట్ సక్సెస్ దక్కినా కొంత ఊరట దక్కేది. కానీ గని, ఆపరేషన్ వాలెంటైన్, గాండీవ ధారి అర్జున, మట్కా ఒకదాన్ని మించి మరొకటి పోవడం ఓపెనింగ్స్ తో పాటు మార్కెట్ ని దెబ్బ తీశాయి. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక హారర్ కామెడీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే అనంతపూర్ తదితర ప్రాంతాల్లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుని కొరియా వెళ్లేందుకు రెడీ అవుతోంది. మేర్లపాక గాంధీ ఫామ్ లో లేకపోయినా కథ మీద నమ్మకంతో వరుణ్ తేజ్ దీన్ని చేస్తున్నారు. కొరియన్ కనకరాజు టైటిల్ పరిశీలనలో ఉంది. దీని తర్వాత దర్శకుడు విక్రమ్ సిరికొండకు మెగా ప్రిన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. ఇతని ట్రాక్ రికార్డు కూడా ఆశాజనకంగా లేదు. 2018లో రవితేజతో టచ్ చేసి చూడు రూపంలో డైరెక్షన్ డెబ్యూ చేసి ఫ్లాప్ రుచి చూశాడు. రచయితగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం, మిరపకాయ్, రేస్ గుర్రం లాంటి సూపర్ హిట్స్ కి పని చేసిన అనుభవం ఉంది.

ఏడేళ్లు దర్శకత్వానికి దూరంగా ఉన్న విక్రమ్ సిరికొండ ఈసారి విభిన్నమైన బ్యాక్ డ్రాప్ లో ప్రేమకథను ఎంచుకున్నట్టు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ దీన్ని తెరకెక్కించనుంది. ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జయాపజయాల సంగతి పక్కన పెడితే వరుణ్ తేజ దగ్గరికి పెద్ద బ్యానర్లే వస్తున్నాయి. యూవీ, మైత్రి ఇలా ప్రొడక్షన్ లో రాజీ లేని సంస్థలతో చేతులు కలుపుతున్నాడు. విక్రమ్ చెప్పబోయే కథ న్యూ ఏజ్ లవ్ స్టోరీ అంటున్నారు. అది ఎలా ఉండబోతోందో చూడాలి. మరో ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చి రిస్క్ చేస్తున్న వరుణ్ తేజ్ ఈ రెండింటితో విజయం అందుకుంటే తిరిగి రేస్ లోకి వచ్చేయొచ్చు.