పెద్ద అంచనాలున్న సినిమాల విడుదల తేదీలు ఒక్కొక్కటిగా వచ్చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సెప్టెంబర్ 25 తీసుకుంది. దానికి పది రోజుల ముందు తేజ సజ్జ ‘మిరాయ్’ వస్తుంది. రవితేజ ‘మాస్ జాతర’ ఆగస్ట్ 27 రావడం దాదాపు ఫిక్స్. అడివి శేష్ ‘డెకాయిట్’ డిసెంబర్ 25 మీద అఫీషియల్ గా కర్చీఫ్ వేసింది. ఇంకా చాలా దూరం ఉన్న జనవరి 14ని నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ లాక్కోగా అటుపై మార్చి 26 నాని ‘ది ప్యారడైజ్’, ఒక రోజు గ్యాప్ తో 27 రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రేక్షకులను పలకరిస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీకి జూన్ 25 పట్టేసుకున్నారు. ఇందులో ఏది మాట మీద ఉంటాయి, ఏవి తప్పుకుంటున్నాయనేది తర్వాతి టాపిక్.
ముందైతే డేట్లు వేసుకుని దానికి తగ్గట్టు ప్లానింగ్ లో ఉన్నాయి. కానీ ఎటొచ్చి ‘విశ్వంభర’ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడం మెగా ఫ్యాన్స్ అసహనాన్ని అంతకంతా పెంచుతోంది. ఒకపక్క అనిల్ రావిపూడి మెగా 157ని పరుగులు పెట్టిస్తున్నాడు. ఫోటోలు, ప్రోమోలంటూ ఇప్పటిదాకా బాగానే హడావిడి చేశాడు. తెగ యాక్టివ్ గా ఉంటున్నాడు. కానీ విశ్వంభర దర్శకుడు వశిష్ట నుంచి ఎలాంటి సౌండ్ లేకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇంద్ర వచ్చిన జూలై 24 రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు కానీ నిజంగా అది సాధ్యమవుతుందా లేదానేది అంతుచిక్కని భేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది.
టీజర్ కొచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ తర్వాత విశ్వంభర హైప్ చాలా తగ్గిపోయింది. దాన్ని రిపేర్ చేయాలంటే సాలిడ్ ట్రైలర్ ఒకటి పడాలి. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారా అంటే దానికీ సమాధానం ఉండదు. కీరవాణి సంగీతంలో రామ రామ అనే పాట తప్ప ఇంకెలాంటి కంటెంట్ రాలేదు. యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ వచ్చినా దానికి సోషల్ మీడియాలో వచ్చిన రెస్పాన్స్ అంతంతమాత్రమే. ఆలస్యానికి మారుపేరుగా ఉన్న యువి క్రియేషన్స్ తో ఈ సమస్య గతంలో చాలా సినిమాలకు వచ్చింది. వర్తమానంలోనూ రిపీటవుతోంది. ఇప్పుడు ఫాన్స్ అంటున్న మాట ఒకటే. విశ్వదాభిరామ వినరా విశ్వంభరా అని.