అసలే కర్ణాటకలో మాతృ భాషాభిమానం చాలా ఎక్కువ. కన్నడలో మాట్లాడనని ఒక బ్యాంక్ మేనేజర్ తెగేసి చెబితే ఏకంగా ముఖ్యమంత్రి ఖండనతో ఆమెను ట్రాన్స్ ఫర్ చేయించే దాకా పరిస్థితి వెళ్ళింది. బెంగళూరు, గుల్బర్గా, బెళగావి లాంటి నగరాల్లో నిత్యం ఆటో డ్రైవర్లు, వ్యాపారస్తులతో నాన్ లోకల్స్ పడుతున్న ఇబ్బందుల గురించి సోషల్ మీడియాలో వీడియోలు గట్రా కనిపిస్తూనే ఉంటాయి. స్థానికేతరుల మీద ఇలా భాషను రుద్దడం ఏమిటనే కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల ఆధిపత్యం పెరుగుతున్న ట్రెండ్ లో ఒక రకంగా వాళ్ళు చేసేది కూడా రైటే అనిపిస్తుంది. ఇక అసలు విషయానికి వద్దాం.
ఇటీవలే చెన్నైలో ఘనంగా జరిగిన తగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ తమిళం నుంచే కన్నడ పుట్టుకొచ్చిందని, అందుకే శివరాజ్ కుమార్ అక్కడి నుంచి ఇక్కడికి అతిథిగా వచ్చారని, కాబట్టి ఆయన మన కుటుంబమే అంటూ చెప్పుకొచ్చారు. ఫ్యానిజంలో మునిగిపోయి వింటున్న శివరాజ్ కుమార్ కు అందులో లోతైన అర్థం తెలియక నవ్వుతూ స్వీకరించేశారు. ఇప్పుడు కమల్ మీద కన్నడ సంఘాలు భగ్గుమంటున్నాయి. రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తమ భాషకు పక్క రాష్ట్రంలో మూలాలు లేవని, హిస్టరీ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
బెంగళూరులో పలు చోట్ల కమల్ తగ్ లైఫ్ ఫోటోలు, బ్యానర్లను కాల్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి రాజకీయ రంగు కుడా పులుముకుంది. బెంగళూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ బయట నిరసనకారులు కమల్ మీద ఇంకు పోస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీని గురించి లోకనాయకుడు ఇంకా ప్రత్యక్షంగా స్పందించలేదు. కన్నడ ఇష్యూ చాలా సున్నితంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి వాటి మీద మాట్లాడేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. లేదంటే చిక్కులు తప్పవు. కర్ణాటకలో జూన్ 5 విడుదల కాబోతున్న తగ్ లైఫ్ మీద ఇప్పుడీ కాంట్రావర్సి ప్రభావం పడేలా ఉంది. కమల్ మరి ఎలా ముగిస్తారో చూడాలి.