మంచు విష్ణు ప్యాన్ ఇండియా మూవీ కన్నప్పకు సంబంధించిన హార్డ్ డ్రైవ్ తస్కరణకు గురయ్యిందనే వార్త ఇండస్ట్రీని, ప్రేక్షకులను కుదిపేసింది. ఇంకో నెల రోజుల్లో రిలీజ్ ఉండగా ఇలాంటి హఠాత్పరిణామం జరగడం షాక్ కు గురి చేసింది. దీని గురించి 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ నుంచి అఫీషియల్ స్టేట్ మెంట్ రావడం కొన్ని సందేహాలను తీర్చేలా ఉంది. రెండు ప్రధాన పాత్రల మధ్య జరిగిన సీక్వెన్స్ పొందుపరిచిన హార్డ్ డ్రైవ్ ముంబైలోని హైప్ స్టూడియోస్ నుంచి హైదరాబాద్ లో విష్ణు ఆఫీస్ కు రవాణా అయ్యింది. కానీ విష్ణు సంస్థతో సంబంధం లేని రఘు, హారిక అనే ఇద్దరి వ్యక్తులు ఇల్లీగల్ గా దాన్ని తీసుకున్నారు.
తర్వాత వాళ్ళు అంతర్ధానం అయిపోయారు. ఇదంతా నాలుగు వారాల క్రితం జరిగిన సంఘటన. విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ అధికారులు దీని వెనుక ఎవరున్నారో వివరించే ప్రయత్నం చేశారు. ఈ దురాగతానికి పాల్పడిన వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థమైపోయింది. దారుణమైన విషయం ఏంటంటే 90 నిమిషాల ఫుటేజ్ ని ఆన్ లైన్ లో లీక్ చేసేందుకు సదరు నిందితులు సిద్ధం కావడం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సకాలంలో స్పందించడంతో తక్షణం చర్యలు తీసుకోవడానికి అవకాశం దొరికింది. ఇదంతా పరిశ్రమలో భాగమైన వాళ్ళే చేయడం అసలు ట్విస్టు. ఇకపై ఫుటేజ్ ఏ రూపంలో కనిపించినా ఎవరూ ఉపేక్షించవద్దని విష్ణు కోరారు.
ఈ కుట్ర వెనుక ఎవరున్నారనే పేర్లను విష్ణు వెల్లడించలేదు కానీ దీని గురించి రకరకాల ఊహాగానాలు అయితే చెలరేగుతున్నాయి. ముఖ్యంగా ఆ రఘు, మానసలను లోతుగా విచారించి ఇదంతా చేసిన అసలు దొంగలను బయట పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఘటన జరిగిన వెంటనే స్పందించి విష్ణు బృందం యాక్టివ్ కావడంతో డ్యామేజ్ ఎక్కువ కాకుండా కాపాడుకోగలిగారు. ఇప్పటికైతే కొంత ఊరట కలిగింది కానీ తీవ్రత పూర్తి స్థాయిలో సున్నా అయినట్టు కాదు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన కన్నప్ప జూన్ 27 విడుదల కానుంది. ముఖ్యంగా ప్రభాస్ పాత్ర మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.