బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన ఆమిర్ ఖాన్ కొన్నేళ్లుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. తొమ్మిదేళ్ల ముందు ‘దంగల్’ సినిమాతో ఏకంగా రూ.2 వేల కోట్ల మైలురాయిని అందుకున్న హీరో ఆయన. ఆ చిత్రం చైనాలో కూడా ఇరగాడేయడంతో ఏ ఇండియన్ సినిమాకూ సాధ్యం కాని విధంగా రూ.2 వేల కోట్ల వసూళ్లు సాధ్యమయ్యాయి. అలాంటి హీరో ఇప్పుడు వంద కోట్ల వసూళ్లు సాధించడం కూడా కష్టంగా కనిపిస్తోంది. ఆయన చివరి రెండు చిత్రాలు ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘లాల్ సింగ్ చడ్డా’ పెద్ద డిజాస్టర్లయ్యాయి. ‘లాల్ సింగ్ చడ్డా’ అయితే మరీ దారుణమైన ఫలితాన్నందుకుంది.
ఆమిర్ నుంచి తర్వాత రాబోయే ‘సితారే జమీన్ పర్’ కూడా అదే బాటలో సాగబోతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ మూవీ ట్రైలర్ అంత నెగెటివిటీని ఎదుర్కొంది మరి.. ‘లాల్ సింగ్ చడ్డా’ తరహాలోనే దీన్ని కూడా ఓ వర్గం సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ ‘బాయ్‌కాట్’కు పిలుపునిస్తోంది. అయినా ఆమిర్ మాత్రం ధైర్యంగా అడుగు ముందుకు వేస్తున్నాడు. జూన్ 20న ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘సితారే జమీన్ పర్’ ఆమిర్ సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమా డిజిటల్ హక్కుల విషయంలో ఆయన బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. దీన్ని అసలు ఏ ఓటీటీలోనూ రిలీజ్ చేయరట. థియేటర్లలో విడుదలైన 8 వారాలకు కూడా ఏ ఓటీటీ సంస్థలోనూ సినిమాను రిలీజ్ చేసేలా ఒప్పందం జరగలేదట. నేరుగా యూట్యూబ్‌లో సినిమాను ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో అందుబాటులో ఉంచుతారట. ఒకసారి సినిమా చూడ్డానికి ఇంత అని చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్లో సినిమాను ఇలా చూడాలే తప్ప ఓటీటీలో విడుదల చేసే ఉద్దేశాలు ప్రస్తుతానికి ఆమిర్‌కు లేవట.
ఓటీటీలో థియేటర్ల ఆదాయాన్ని తినేస్తున్నాయనే ఉద్దేశంతో దీనికి బ్రేక్ వేయాలని ఆమిర్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక ముందు తన ప్రతి సినిమాకూ ఇలాగే చేయాలని ఆయన భావిస్తున్నారట. ఐతే ఈ ప్రయోగం విజయవంతం కావాలంటే ముందు ‘సితారే జమీన్ పర్’ థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకోవాలి. అప్పుడే ఆమిర్ ఏం చేసినా చెల్లుతుంది. స్పానిష్ మూవీ ‘ఛాంపియన్స్’ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి ఆర్.ఎస్.ప్రసన్న దర్శకుడు.