సమాజంలో లాగే సినీ పరిశ్రమలోనూ ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయి. కాకపోతే అవి అన్ని సందర్భాల్లో బయటపడవు. ఇమేజ్ లు దెబ్బ తింటాయనే ఉద్దేశంతో జాగ్రత్త పడతారు. మార్కో హీరో ఉన్ని ముకుందన్ ఉదంతం ఉదాహరణగా నిలుస్తోంది. కేరళ మీడియా కథనాల ప్రకారం ముందు జరిగిందేంటో చూద్దాం. ఇటీవలే టోవినో థామస్ నటించిన నరివెట్ట ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. రివ్యూలు పాజిటివ్ గానే వచ్చాయి. పోలీస్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ కాప్ డ్రామాలో కథనం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని హిట్ దిశగా వెళ్తోంది.
ఉన్ని ముకుందన్ దగ్గర గతంలో మేనేజర్ గా పని చేసిన విపిన్ ఈ నరివెట్టను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో కోపం వచ్చిన మార్కో హీరో కక్కనాడ్ ప్రాంతంలో ఉన్న ఒక అపార్ట్ మెంట్ లో విపిన్ ని దూషించడమే కాక ఏకంగా చేయి కూడా చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం బాగా పొద్దుపోయాక జరిగిందని సదరు మేజర్ కంప్లయింట్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇన్ఫో పార్క్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఫిర్యాదు మీద విచారణ జరుగుతోంది. సిసి కెమెరాలు, ఇతర సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమించబోతున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.
అయినా తనకు సంబంధం లేని సినిమా బాగుందని ఎక్స్ మేనేజర్ పొగిడితే దానికి ఉన్ని ముకుందన్ ఇలా రియాక్ట్ కావడం విచిత్రమే. మార్కోతో ఒక్కసారిగా మార్కెట్ పెరిగిన ఈ హీరోకు మాస్ లో ఫాలోయింగ్ వచ్చేసింది,. తెలుగులో భాగమతి, జనతా గ్యారేజ్ లో సపోర్టింగ్ రోల్స్ చేసిన ఉన్ని ప్రస్తుతం మార్కో 2 చేసే ప్లాన్ లో ఉన్నాడు. భీభత్సమైన వయొలెన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మార్కోకి సీక్వెల్ మీద మల్లువుడ్ లో చాలా క్రేజ్ ఉంది. ఇలాంటి టైంలో లేనిపోని వివాదాలు తెచ్చుకోవడం సరికాదు. ఉన్ని ముకుందన్ వెర్షన్ విన్నాక క్లారిటీ రావొచ్చు. అన్నట్టు నరివెట్ట తెలుగు డబ్బింగ్ ని మైత్రి ప్లాన్ చేసినా పలు కారణాల వల్ల వాయిదా పడింది.