=

రీ రిలీజ్ సినిమాకు ప్రీమియర్ షోలు

ఖలేజాకు జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఆశ్చర్యమో ఆనందమో అర్థం కాని ఒక విచిత్రమైన పరిస్థితిలో అభిమానులున్నారు. వారం ముందుగానే బుక్ మై షోలో టికెట్లు పెడితే హాట్ కేకుల్లా అమ్ముడుపోవడం చూసి ట్రేడ్ నివ్వెరపోతోంది. మొదటిరోజు నాటికి మూడు కోట్లకు పైగా గ్రాస్ వసూలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మాములుగా ఈ మొత్తం ఒక్కోసారి టయర్ 2 హీరోల కొత్త రిలీజులకు కూడా రాదు. అలాంటిది ఒక పాత మూవీకి ఈ స్థాయి రెస్పాన్స్ చూసి మహేష్ బాబుని సామి శిఖరం అనడం తప్ప అభిమానులు ఇంకేం చేయగలరు. ఇక్కడితో ఈ సునామి ఆగడం లేదు.

పబ్లిక్ డిమాండ్ చూసి ఒక రోజు ముందు అంటే మే 29న హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో టికెట్ రేట్ బ్లాకులో కనీసం అయిదు వందల నుంచి రెండు వేల రూపాయల మధ్యలో ఉండొచ్చని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఒరిజినల్ రిలీజ్ టైంలో ఫ్లాప్ గా నిలిచి నిర్మాతకు నష్టాలు తెచ్చిన ఖలేజా క్రమంగా కల్ట్ స్టేటస్ దక్కించుకోవడం తెలిసిందే. ముఖ్యంగా ఓటిటి, శాటిలైట్ ఛానల్స్ లో వచ్చాక దీనికి కల్ట్ ఫాలోయింగ్ పెరిగింది. అప్పట్లో థియేటర్లో మిస్ చేసిన బ్యాచులన్నీ ఇప్పుడు చూసేందుకు ఎగబడుతున్నాయి.

ఖలేజా తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే భైరవం కోసం రిజర్వ్ చేసిన కొన్ని షోలు స్క్రీన్లు ఇవ్వాల్సి వస్తోందని అఫ్ ది రికార్డు బయ్యర్ల నుంచి వినిపిస్తున్న మాట. డిమాండ్ అండ్ సప్లై సూత్రం అనుసరించి ఇలా చేయడం తప్పడం లేదని అంటున్నారు. ఒకవేళ భైరవం బాగుంటే ఆ వీకెండ్ లేదా రెండు మూడు రోజుల తర్వాతైనా చూస్తారని, కానీ ఖలేజాని ఫస్ట్ డే ఎంజాయ్ చేయడానికి ఎగబడుతున్న వాళ్ళని ఆపడం కన్నా షోలు పెంచడమే ఉత్తమమని భావిస్తున్నారు. ఫైనల్ రనయ్యేలోపు పది కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదట. అదే జరిగితే రీ రిలీజుల్లో మహేష్ మరో రికార్డు నమోదు చేయడం ఖాయం.