తెలుగు సినీ రంగ అగ్రనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను ఆపే దమ్ము ఎవరికీ లేదని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండురోజుల కిందట రాసిన లేఖ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. సినీ రంగానికి కృతజ్ఞత లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. బన్నీ వాసు, అల్లు అరవింద్, నిర్మాత నాగవంశీ ఇప్పటి వరకురియాక్ట్ అయ్యారు.
తాజాగా దిల్ రాజు కూడా మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కల్యాణ్ సినిమాలను ఆపే దమ్ము ఎవరికుందని ప్రశ్నించారు. అలా చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. ఎగ్జిబిటర్లకు కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు ఎగ్జిబిటర్లు(పేర్లు చెప్పలేదు) ఈ సమస్యను వివరించారని చెప్పారు. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేసినట్టు చెప్పారు.
ప్రస్తుతం ఎగ్జిబిటర్లు, డిస్ట్రి బ్యూటర్ల పర్సంటేజీ సమస్య రెండు రాష్ట్రాల్లోనూ ఉందన్నారు. ఈ క్రమంలో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు చెబితే వద్దని తాను అడ్డుకున్నట్టు రాజు తెలిపారు. బంద్ అనేది కేవలం ఆలోచన మాత్రమేనని దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అయితే.. వీరమల్లు సినిమా విషయంలో తప్పుడు ప్రచారం ఎక్కువైందని ఆరోపించారు. కానీ, పవన్‌కల్యాణ్ సినిమాలను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదన్నారు.
వాస్తవానికి ఫిలిం చాంబర్‌లోనే సమస్యలు ఉన్నాయని, రెండు ప్రభుత్వాల నుంచి తమకు ఎలాంటి సమస్యలు లేవని రాజు వివరించారు. సినిమా టికెట్ల ధరలను పెంచమంటే.. ఎలాంటి ప్రశ్నలు కూడా అడగకుండానే పెంచుతున్నారని చెప్పారు. కానీ, తమలో తమకు ఐక్యత లోపించిన కారణంగానే ఇలా జరుగుతోందని.. దీనిలో మీడియా పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ఇక నుంచైనా ఇలాంటివి కట్టిపెట్టాలని ఆయన సూచించారు.