=

కన్నప్ప.. వంద కోట్లు కాదట

మంచు కుటుంబానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం.. కన్నప్ప. దాదాపు పదిహేనేళ్ల నుంచి ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాడు మంచు విష్ణు. ముందు తనికెళ్ళ భరణి దర్శకత్వంలో ఈ సినిమా చేయాలని అనుకున్నాడు విష్ణు. కానీ కొన్ని కారణాలతో ఆయన తప్పుకోగా.. చాన్నాళ్ల పాటు సినిమా చర్చల్లో లేకుండా పోయింది. కానీ కొన్నేళ్ల కిందట మళ్లీ సన్నాహాలు మొదలుపెట్టి రెండేళ్ల కిందట ఈ మెగా మూవీని సెట్స్ మీదికి తీసుకెళ్లాడు విష్ణు. హిందీలో ‘మహాభారతం’ సీరియల్ తీసిన ముకేశ్ కుమార్ సింగ్ దర్శకుడు.

మంచు విష్ణు మార్కెట్ బాగా డౌన్ అయినా సరే.. వంద కోట్లకు పైగా బడ్జెట్లో ఈ సినిమాను తీయడానికి మోహన్ బాబు సిద్ధమయ్యారు. ఐతే మొదలైనపుడు బడ్జెట్ వంద కోట్లే కానీ.. రిలీజ్ టైంకి లెక్క 200 కోట్లు దాటిపోతోందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో విష్ణునే స్వయంగా వెల్లడించాడు.

“భరణి గారు ‘కన్నప్ప’ ఐడియా చెప్పినపుడు నాకెంతో నచ్చింది. విదేశాల నుంచి నిపుణులను రప్పించి దీన్ని డెవలప్ చేయించా. ఐతే నా అభిరుచిని గమనించి ఈ సినిమాను భారీ స్థాయిలో చేయమని చెప్పి కథ నాకిచ్చేశారు. దాన్ని తీసుకుని నా వెర్షన్లో దాన్ని రెడీ చేశా. వంద కోట్ల లోపు బడ్జెట్ అవుతుందని ముందు అనుకున్నాం. కానీ రెట్టింపు ఖర్చయింది. ‘మహాభారత్’ తీసిన ముకేశ్ కుమార్‌కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించమని నాన్నే చెప్పారు. ఆయన ఇచ్చిన సపోర్ట్‌తోనే ఇంత భారీ సినిమా తీయగలిగాం.

ఈ ప్రాజెక్టుకు అండగా నిలిచిన ప్రభాస్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాన్నకు, ప్రభాస్‌కు మధ్య వచ్చే సన్నివేశం సినిమాలో హైలైట్‌గా ఉంటుంది. నాకు కొత్త వాళ్లను ప్రోత్సహించడం ఇష్టం. అలాగే వీఎఫ్‌ఎక్స్‌లో పెద్దగా అనుభవం లేని ఓ వ్యక్తికి ఈ సినిమా బాధ్యతలు అప్పగించా. అందువల్లే సినిమా ఆలస్యం అయింది. అది ‘కన్నప్ప’ విషయంలో నేను చేసిన అతి పెద్ద తప్పు. ఈసారి చెప్పిన డేట్‌కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం” అని విష్ణు తెలిపాడు.