స్పిరిట్ నుంచి దీపికా పదుకునేని తప్పించారనే వార్త రెండు రోజుల క్రితం ఎంత కలకలం రేపిందో చూశాం. ఆమె కండీషన్లు, డిమాండ్లు తట్టుకోలేక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంట్రాక్ క్యాన్సిల్ చేసుకున్నారనే టాక్ బాలీవుడ్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయ్యింది. తిరిగి ఎవరిని తీసుకుంటారనే దాని గురించి రకరకాల పేర్లు వినిపించాయి కానీ ఏవీ నిర్ధారణగా తెలియలేదు. కొందరేమో రుక్మిణి వసంత్ అన్నారు. మరికొందరు మృణాల్ ఠాకూర్ ని తీసుకొచ్చారు. ఎవరూ ఫైనల్ కాలేదన్నది వాస్తవం. కానీ గుట్టుచప్పుడు కాకుండా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి స్పిరిట్ సైన్యంలో చేరిపోయింది.
ఇన్స్ టా స్టేటస్ లో స్పిరిట్ టైటిల్ ని అన్ని భాషల్లో షేర్ చేసుకుంటూ టీమ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేసింది. మెయిన్ హీరోయినా కాదానేది చెప్పలేదు కానీ ప్రాక్టికల్ గా చూస్తే రెండో కథానాయికే అయ్యుంటుంది. యానిమల్ దెబ్బకు ఒక్క రోజులో స్టార్ అయిపోయిన త్రిప్తి డిమ్రికి అవకాశాలు వేగంగా వచ్చాయి కానీ హిట్లు పడలేదు. పైగా తనను అధిక శాతం దర్శకులు పెర్ఫార్మన్స్ కోసం కాకుండా గ్లామర్ షో చేయడానికి పాత్రలు రాయడంతో గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంది. తన ఆశలన్నీ ప్రస్తుతం ధఢక్ 2 మీద ఉన్నాయి. తమిళ పరియేరుమ్ పెరుమాళ్ రీమేక్ గా ఇది రూపొందింది.
ఇండస్ట్రీలో బ్రేక్ ఇచ్చిన దర్శకుడే పిలిచి ప్రభాస్ సినిమాలో ఛాన్స్ ఇస్తే త్రిప్తి డిమ్రికి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. చూస్తుంటే వేసవికు కొంచెం ఆటో ఇటో స్పిరిట్ మొదలయ్యే సూచనలు పెరుగుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీని పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్. ది రాజా సాబ్ మరికొంత ఆలస్యం జరిగే సూచనలున్నాయని పీపుల్స్ మీడియా వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. అదే నిజమైన పక్షంలో సందీప్ వంగా డార్లింగ్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళిపోతాడు. ప్రభాస్ లైనప్ విషయంలో కొనసాగుతున్న కన్ఫ్యూజన్ తీరాలంటే ఇంకో రెండు మూడు వారాలు ఎదురు చూడాలి.