మంచు విష్ణు ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ‘కన్నప్ప’ సినిమా మీద తన ‘సింగిల్’ మూవీ ట్రైలర్లో పరోక్షంగా కౌంటర్ వేసిందుకు ఇటీవల యువ కథానాయకుడు శ్రీ విష్ణు సారీ చెప్పాల్సిన పరిస్థితి రావడం తెలిసిందే. ‘కన్నప్ప’ టీజర్లో మంచు విష్ణు అన్న ‘శివయ్యా’ డైలాగ్‌ను శ్రీ విష్ణు ‘సింగిల్’లో రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించగా.. అది విష్ణు అండ్ టీంను హర్ట్ చేసింది. విషయం తెలిసి.. శ్రీ విష్ణు వెంటనే సారీ చెప్పాడు. సినిమా నుంచి కూడా ఆ డైలాగ్ తీసేశాడు.
ఐతే ఇటీవల ‘భైరవం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో స్వయంగా విష్ణు తమ్ముడే అయిన మంచు మనోజ్ సేమ్ డైలాగ్‌తో అన్నకు కౌంటర్ ఇచ్చాడు. ‘శివయ్యా’ అని పిలిస్తే శివుడు రాడంటూ వెటకారం చేశాడు. దీనిపై విష్ణు నుంచి ఏ రియాక్షన్ లేదు. కానీ ఈలోపే మంచు మనోజ్ తప్పు తెలుసుకుని సారీ చెప్పడం విశేషం. ‘కన్నప్ప’ సినిమా కోసం ఎంతో మంది పని చేశారని.. తన అన్న మీద కోపంతో తాను ఆ డైలాగ్ మీద వెటకారం ఆడడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతూ.. ‘కన్నప్ప’ టీంకు మనోజ్ సారీ చెప్పాడు. అంతే కాక.. ‘కన్నప్ప’ బాగా ఆడాలంటూ అతను విషెస్ కూడా చెప్పాడు.
“నేనేదో ఎమోషన్లో శివయ్యా అన్నాను. కానీ ఆ సినిమాకు కూడా డైరెక్టర్, కెమెరామన్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు.. ఇలా చాలామంది పని చేశారు. ఆ హీరోలకు ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్కరు చేసిన తప్పుకి నేను ఇంతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని భాధ పడ్డాను. నేను అన్నదానికి ఆ చిత్ర కాస్ట్ అండ్ క్రూ నన్ను క్షమించండి. నేను అలా అని ఉండకూడదు. సినిమా ఒక్కడిది కాదు. అందరిదీ. నేను ఈ రోజు నుంచి అలాంటి కామెంట్లు చేయను. కన్నప్ప సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని మనోజ్ తెలిపాడు.