పెద్ది తర్వాత రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ తో చేయాల్సిన మూవీ కొంచెం ఆలస్యమవుతుందని, ఈలోగా వేరే డైరెక్టర్ తో ఇంకో ప్రాజెక్టు చేస్తారనే ప్రచారం ఈ మధ్య కొంచెం గట్టిగానే తిరిగింది. స్క్రిప్ట్ వర్క్ కారణంగా చూపిస్తూ పలు కథనాలు కూడా వెలువడ్డాయి. వాటికి సుకుమార్ స్వయంగా చెక్ పెట్టేశారు. స్వగ్రామం మట్టపర్రుకి వెళ్లిన సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమా ఆర్సి 17 అని, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్స్ జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చేశారు. జానర్, ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందనే వివరాలు చెప్పలేదు కానీ క్లారిటీ అయితే ఇచ్చారు.
వచ్చే ఏడాది మార్చిలో పెద్ది రిలీజవుతుంది. ఇంకా పదినెలల సమయం ఉంది కాబట్టి సుకుమార్ కు తగినంత సమయమేనని చెప్పాలి. జూన్ నుంచి షూటింగ్ మొదలుపెట్టుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో థియేటర్ సినిమాలు చూస్తున్నారని, నగరాల్లో యువత యాప్స్, ఓటిటికి అలవాటు పడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన సుకుమార్ వాస్తవిక కోణంలో మాట్లాడారు. పుష్పలో బిజీగా ఉండటం వల్ల మూడేళ్లు స్వంత ఊరికి రాలేకపోయాయని చెప్పిన సుకుమార్ పిల్లలు, యూత్, స్థానికులతో చాలా సమయం గడిపి అక్కడి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.
సో ఇక ఎలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. పెద్ది తర్వాత రామ్ చరణ్ 17 సుకుమార్ తోనే. కాకపోతే ఎంత సమయం పడుతుందనేది మాత్రం ఇప్పట్లో చెప్పలేం. రంగస్థలం, పెద్ది లాగా విలేజ్ బ్యాక్ డ్రాప్ కాకుండా సుకుమార్ ఈసారి జానర్ మారుస్తారని తెలిసింది. చరణ్ కు మరింత ఛాలెంజ్ అనిపించేలా కొత్త తరహా క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. యాక్షన్ టచ్ ఎక్కువగా ఉంటూనే సుకుమార్ మార్కు ఎలివేషన్లు, ట్విస్టులు పుష్కలంగా ఉంటాయట. ఇంత కన్నా డీటెయిల్స్ ఆశించడం అత్యాశ కాబట్టి ఇంకొంత కాలం వేచి చూడాలి. ఫ్యాన్స్ అయితే రంగస్థలంని మించిన బ్లాక్ బస్టర్ ఆశిస్తున్నారు.