సుమంత్.. ఇవి కదా చేయాల్సింది

అక్కినేని వారి ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాల్లోకి అడుగు పెట్టిన నటుడు.. సుమంత్. తొలి చిత్రం ‘ప్రేమకథ’తోనే నటుడిగా తనేంటో రుజువు చేసుకున్నాడు. కానీ తర్వాత సరైన సినిమాలు ఎంచుకోకపోవడంతో ఒడుదొడుకులు తప్పలేదు. ఐతే ‘సత్యం’ లాంటి మంచి సినిమాతో గాడిన పడ్డట్లే కనిపించాడు. కానీ తర్వాత మళ్లీ కథ మామూలే. తప్పటడుగులతో కెరీర్ గాడి తప్పింది. ఓ మంచి సినిమా చేయడం.. తర్వాత వరుసగా పేలవమైన సినిమాలు అందించడం.. ఇదే వరస. గోదావరి, మళ్ళీ రావా లాంటి గొప్ప సినిమాల తర్వాత కూడా ఇదే జరిగింది.

‘మళ్ళీ రావా’ తర్వాత సుమంత్ నుంచి చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఒక్కటీ ఆకట్టుకోలేదు. ఇక అందరూ సుమంత్‌ను మరిచిపోతున్న దశలో ఇప్పుడు ‘అనగనగా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుమంత్. ఈటీవీ విన్ ద్వారా నేరుగా డిజిటల్‌‌గా రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. చూసిన వాళ్లందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పిల్లల చదువులు.. వారి మీద సొసైటీ పెట్టే ఒత్తిడి.. ఫ్రీ లెర్నింగ్.. తండ్రీ కొడుకుల బంధం.. ఇలా పలు అంశాలను చర్చిస్తూ సాగిన ఈ సినిమా ప్రేక్షకులను కదిలించేస్తోంది. సొసైటీకి చాలా అవసరమైన సినిమా అంంటూ దీన్ని కొనియాడుతున్నారు. నెమ్మదిగా ఈ సినిమాకు ఆదరణ పెరుగుతోంది.

ఈ సినిమాలో సుమంత్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. మెచ్యూర్డ్ రోల్స్‌ను అతను బాగా పోషించగలడని ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. ‘అనగనగా’ ఇందుకు మరో ఉదాహరణ. సుమంత్‌ను అందరూ మరిచిపోతున్న దశలో తన సత్తా ఏంటో ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. ఈ సినిమా చూసిన చాలామంది అక్కినేనిని గుర్తు చేసుకుంటున్నారు. సుమంత్ తాతను గుర్తు చేశాడంటున్నారు. సుమంత్ ఇలాంటి పాత్రలు చేయకుండా పనికిరాని కథలు, పాత్రలను ఎందుకు ఎంచుకుంటున్నాడని ప్రశ్నిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకుని ఇకముందైనా తనకు సూటయ్యే ఇలాంటి మంచి పాత్రలు, కథలను ఎంచుకుని కెరీర్‌ను చక్కదిద్దుకోవాలని కోరుకుంటున్నారు.