కేతిక శర్మ సుడి తిరిగింది…ఇదిదా సర్ప్రైజు

దేనికైనా టైం కలిసి రావాలని పెద్దలు ఊరికే అనలేదు. కేతిక శర్మను చూస్తుంటే అదే అనిపిస్తోంది. 2021 ఆకాష్ పూరి రొమాంటిక్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తనకు డెబ్యూనే డిజాస్టరయ్యింది. తర్వాత నాగ శౌర్య లక్ష్య, వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా దారుణంగా పోయాయి. పవన్ కళ్యాణ్ బ్రోలో సాయి ధరమ్ తేజ్ కు జోడిగా నటిస్తే దాని వల్ల దక్కిన ఫలితమూ అంతంత మాత్రమే. అంటే నికరంగా నాలుగేళ్ల కాలంలో ఒక్క చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. దీంతో రాబిన్ హుడ్ లో అదిదా సర్ప్రైజ్ స్పెషల్ సాంగ్ చేసింది. పుష్ప 2లో శ్రీలీల చేయగా లేనిది నేనేంటి అనుకుందో ఏంటో అదే పెద్ద ప్లస్ అయ్యింది.

సినిమా పోయింది కానీ కేతిక శర్మ సాంగ్ మాత్రం హిట్టయ్యింది. కట్ చేస్తే శ్రీవిష్ణు సింగిల్ లో మెయిన్ హీరోయిన్స్ లో ఒకరిగా నటించడం కేతిక శర్మకు మరో సూపర్ సక్సెస్ అందించింది. లుక్స్ తో పాటు నటన కూడా ఆకట్టుకునేలా ఉండటంతో క్రమంగా ఆఫర్స్ పెరుగుతున్నాయట. రవితేజ – దర్శకుడు కిషోర్ తిరుమల కాంబోలో తెరకెక్కబోయే మూవీకి ఆమె మెయిన్ లీడ్ గా అనుకుంటున్నారని లేటెస్ట్ అప్డేట్. అనార్కలి టైటిల్ ప్రచారంలో ఉంది. తమిళంలో రాజేష్ సెల్వ సినిమా ఒకటి ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. గీతా ఆర్ట్స్ సంస్థ మరో చిత్రం కోసం అడ్వాన్స్ ఇచ్చిందనే టాక్ ఉంది.

మైత్రి బ్యానర్ లోనే మరో ప్రాజెక్టులో కేతిక లాకయ్యిందని తెలిసింది. ఇది కన్ఫర్మ్ అయ్యాకే రాబిన్ హుడ్ సాంగ్ చేసిందనే లింక్ ని కొట్టిపారేయలేం. సో సింగిల్ తో బోణీ జరిగిపోయింది కాబట్టి కేతిక శర్మ టైం మొదలైనట్టేననుకోవాలి. ఢిల్లీకి చెందిన ఈ ఒకప్పటి సోషల్ మీడియా మోడల్ ప్రస్తుతం హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉంది. వరస ఆఫర్లు రావడంతో మెల్లగా కెరీర్ సెటిల్ చేసుకోవాలని చూస్తోంది. ఇంకో ఒకటో రెండో హిట్లు పడ్డాయంటే పెద్ద హీరోల సరసన కూడా పిలుపు రావొచ్చు. అయినా అయిదు సంవత్సరాలు ఓపిగ్గా ఎదురు చూసినందుకు రిజల్ట్ అయితే దక్కింది కానీ దాన్ని నిలబెట్టుకోవడమే తరువాయి.