-->

జూనియర్ పుట్టినరోజు ఈసారి చాలా స్పెషల్

ఈ సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు చాలా ప్రత్యేకం కానుంది. ఎందుకంటే కెరీర్ మొదలుపెట్టిన పాతిక సంవత్సరాలకు తారక్ బాలీవుడ్ ఎంట్రీ సాకారమయ్యింది. అది కూడా వార్ 2 లాంటి ప్యాన్ ఇండియా మూవీ ద్వారా కావడంతో అభిమానుల ఎగ్జైట్ మెంట్ మాములుగా లేదు. గతంలో ఆర్ఆర్ఆర్ లాంటివి డబ్బింగ్ రూపంలో హిందీలో బ్లాక్ బస్టర్స్ సాధించినా ఒక స్ట్రెయిట్ మూవీ ద్వారా తానేంటో ఋజువు చేసుకోవాలనేది అభిమానుల కోరిక. దాన్ని నెరవేరుస్తూ హృతిక్ రోషన్ తో కలిసి తన మొదటి అడుగును వేయబోతున్న యంగ్ టైగర్ డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ సాధించే వైబ్స్ తీసుకొస్తున్నాడు.

తాత పేరుని పెట్టుకోవడమే కాదు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యతనూ మోసుకుంటూ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన కార్యసాధనలో గొప్ప విజయాలు సాధిస్తూ వచ్చాడు. ఒకదశలో వరస ఫ్లాపులు కెరీర్ ని రిస్క్ లో పెట్టినప్పుడు ఆత్మపరీశీలన చేసుకుని కథలో ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా టెంపర్ నుంచి దేవర దాకా ఒక్క పరాజయం లేకుండా అప్రతిహతంగా సాగుతూ ఉన్నాడు. తన సాటి హీరోల్లో ఇంత సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డు ఎవరికీ లేదన్నది వాస్తవం. ఇతరులకు ఎన్ని హిట్లు ఉన్నా మధ్యలో ఒక యావరేజో డిజాస్టరో పడ్డాయి తప్పించి గత కొన్నేళ్లలో కన్సిస్టెంట్ గా ట్రాక్ రికార్డు ఉన్నది జూనియర్ కే.

ఇప్పుడు వార్ 2 ఎంత పెద్ద సక్సెసవుతుందనే దాన్ని బట్టి తారక్ తర్వాతి ప్లానింగ్ ఉండబోతోంది. ప్రభాస్ ఆదిపురుష్ తో స్ట్రెయిట్ హిందీ మూవీ చేసినప్పటికీ అది ఆశించిన విజయం సాధించలేదు. కానీ వార్ 2 లెక్క వేరే. బడ్జెట్, కంటెంట్, యాక్షన్, ప్రొడక్షన్ ఇలా అన్ని కోణాల్లోనూ మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఆడియన్స్ తో క్లిక్ అయితే మటుకు జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ పెరిగిపోతుంది. తమ స్పై యూనివర్స్ లో తనకో ప్రత్యేక ప్రాధాన్యత దక్కేలా యష్ రాజ్ ఫిలింస్ ప్లానింగ్ లో ఉందట. అదే నిజమై తెలుగుతో పాటు హిందీలోనూ వరుసగా సినిమాలు చేస్తే జూనియర్ ఎన్టీఆర్ కు అరుదైన ఘనత దక్కుతుంది.