సూర్య.. తమిళంలో టాప్ స్టార్లలో ఒకడు. కార్తీక్ సుబ్బరాజ్‌కు దర్శకుడిగా మంచి స్థాయే ఉంది. పూజా హెగ్డే, జోజు జార్జ్, నాజర్.. ఇలా పెద్ద కాస్టింగ్ తోడై భారీ బడ్జెట్లో తెరకెక్కిన చిత్రం.. రెట్రో. చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న సూర్యకు ఇది పెద్ద బ్రేక్ ఇస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి విడుదలకు ముందు. రిలీజ్ రోజు ఈ సినిమాను తమిళ మీడియా, సూర్య ఫ్యాన్స్ ఆకాశానెత్తేశారు. కల్ట్ మూవీగా ప్రచారం చేశారు.
కానీ తెలుగు ప్రేక్షకులు ‘రెట్రో’ సినిమా చూసి తలలు పట్టుకున్నారు. అసలు ఈ సినిమా కథేంటో.. హీరో పాత్రేంటో అర్థం కాక.. ఏమాత్రం ఎంగేజ్ చేయని సన్నివేశాలతో విసుగెత్తిపోయి థియేటర్ల నుంచి బయటికి వచ్చారు. కానీ తమిళ జనాలు మాత్రం ఈ సినిమా గురించి తొలి వీకెండ్లో ఎలివేషన్లు ఇచ్చుకుంటూనే సాగిపోయారు. కానీ తీరా చూస్తే ఈ చిత్రం తమిళనాట కూడా ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయింది. తెలుగులో తొలి రోజే డిజాస్టర్ అని తేలిపోయింది. తమిళంలో ఓ వారం రోజులు ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిన ‘రెట్రో’ తర్వాత చల్లబడిపోయింది. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అనే చిన్న సినిమా.. సూర్య మూవీకి చెక్ పెట్టింది.
దర్శకుడు శశికుమార్, సీనియర్ నటి సిమ్రన్ ముఖ్య పాత్రలు పోషించిన సినిమా ఇది. స్టార్లు లేకపోయినా కంటెంట్‌తో ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అభిషన్ అనే కొత్త దర్శకుడు చాలా హృద్యంగా ఈ సినిమాను తీసి ప్రేక్షకులను మెప్పించాడు. విడుదలకు ముందు ప్రెస్ ప్రివ్యూల నుంచే చాలా మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి.. తర్వాత మౌత్ టాక్ కూడా తోడవడంతో క్రమంగా వసూళ్లు పెంచుకుంటూ సాగింది. తొలి రోజు రెండున్నర కోట్లతో మొదలైన సినిమా ఇప్పుడు రూ.60 కోట్ల మార్కును దాటేసింది. తమిళనాడులో.. ‘రెట్రో’ కంటే ఈ సినిమా వసూళ్లే ఎక్కువ కావడం విశేషం. ఇటీవల సక్సెస్ మీట్లో చిత్ర బృందం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించడం విశేషం.