=

మిషన్ ఇంపాజిబుల్.. మోత మోగిపోతోంది

మిషన్ ఇంపాజిబుల్.. ఈ పేరు చెబితే చాలు ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ సినిమాల ప్రియులకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. టామ్ క్రూయిజ్ ఈ ఫ్రాంఛైజీతోనే తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగాడు. 1996లో ‘మిషన్ ఇంపాజిబుల్’ ఫ్రాంఛైజీలో తొలి సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ కాగా.. తర్వాత ఈ సిరీస్‌లో ఏడు చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి హిట్టయ్యాయి. వయసు మీద పడ్డా ఏమాత్రం దూకుడు తగ్గించకుండా, అద్భుతమైన యాక్షన్ విన్యాసాలతో టామ్ క్రూయిజ్ అలరిస్తూనే ఉన్నాడు.

రెండేళ్ల కిందట వచ్చిన ‘మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్-1’లో అతను చేసిన యాక్షన్ సీక్వెన్సులకు ప్రపంచం విస్తుబోయింది. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో చిట్టచివరి సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ రిలీజ్‌కు రెడీ అయింది. హాలీవుడ్లో ఈ నెల 23న ఈ చిత్రం విడుదల కానుండగా.. వారం ముందే ఇండియాలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేయడం విశేషం. ఈ అవకాశాన్ని భారతీయ ప్రేక్షకులు గొప్పగా ఉపయోగించుకుంటున్నారు. ఈ వీకెండ్లో ఇండియన్ సినిమాలన్నింటినీ వెనక్కి నెట్టి బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది ‘మిషన్ ఇంపాజిబుల్’. దేశవ్యాప్తంగా భాషా బేధం లేకుండా ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు.

హైదరాబాద్‌లో ఈ సినిమాకు మల్టీప్లెక్సుల్లో టికెట్లు దొరకడం కష్టంగా ఉంది. చాలా షోలు హౌస్ ఫుల్ అవుతున్నాయి. మిగతావి ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్నాయి. ఈ చిత్రానికి అదిరిపోయే రివ్యూలు వస్తున్నాయి. కథలో మలుపులు.. యాక్షణ్ సీక్వెన్స్‌ల గురించి అందరూ కొనియాడుతున్నారు. టామ్ క్రూయిజ్‌నైతే ఆకాశానికెత్తేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ లాంటి పెద్ద దర్శకుడు ఈ సినిమా మీద ప్రశంసలు కురిపించాడు. ‘మిషన్ ఇంపాజిబుల్’ ఫ్రాంఛైజీలో ఇదే ది బెస్ట్ అని ఆయన కితాబిచ్చాడు. ఇలాంటి సినిమాలు చూశాక మనం కూడా ఫిలిం మేకర్స్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది అని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. ఇండియాలో హాలీవుడ్ సినిమాల రికార్డులను ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ బద్దలు కొట్టేస్తుందన్న అంచనాలు కలుగుతున్నాయి.