గత కొన్నేళ్లలో తెలుగులో బాగా వైరల్ అయిన పాటల్లో ‘చుట్టమల్లే చుట్టేసిందే..’ పాట ఒకటి. ‘దేవర’ సినిమా కోసం అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఒక శ్రీలంక పాటను కాపీ కొట్టాడంటూ విమర్శలు వచ్చినా సరే.. అవేవీ ఈ పాట వైరల్ కాకుండా ఆపలేకపోయాయి. ఇక రిలీజ్ టైం వచ్చేసరికి ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఎక్కడ చూసినా ఈ పాటే కనిపించింది. ఈ పాట వినసొంపుగా ఉండడమే కాదు.. కనువిందుగానూ అనిపించింది. మెలోడీ సాంగే అయినప్పటికీ.. ఇందులో సింపుల్‌గా సాగిన స్టెప్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఐతే ఇంత హిట్ అయిన ఈ పాట విషయంలో తనకు రావాల్సిన క్రెడిట్ రాలేదంటూ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ ఫీలవుతున్నాడు. బాలీవుడ్లో ఫేమస్ అయిన బోస్కో.. తెలుగులో చేసిన ఏకైక పాట ఇది. ఈ పాటలో స్టెప్స్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చినప్పటికీ.. టీం మాత్రం తన గురించి ఎక్కడా మాట్లాడలేదని బోస్కో ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు.
మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా.. ప్రమోషన్ల సమయంలో జాన్వీ కపూర్ అయినా తన గురించి మాట్లాడుతందని ఆశించానని.. కానీ ఆమె కూడా తన తన ప్రస్తావనే తేకపోవడం బాధించిందని బోస్కో తెలిపాడు. ‘బ్యాడ్ న్యూస్’ సినిమాలో ఎంతో పాపులర్ అయిన ‘తౌబా తౌబా’ పాటకు తానే కొరియోగ్రఫీ చేశానని.. ఆ సినిమా ప్రమోషన్లలో హీరో విక్కీ కౌశల్ మాత్రం తన గురించి గొప్పగా మాట్లాడాడని బోస్కో అన్నాడు. ఏదైనా పాట పాపులర్ అయినపుడు కొరియోగ్రాఫర్‌కు తగిన గుర్తింపు ఇవ్వాలని.. కానీ ఇండస్ట్రీలో ఇది కొరవడిందని అతను ఆవేదన వెలిబుచ్చాడు. బాలీవుడ్లో జూమ్ జో పఠాన్, కాలా చష్మా లాంటి పాటలకు బోస్కో చేసిన కొరియోగ్రఫీకి మంచి పేరే వచ్చింది.