రిషి కపూర్.. తెరపై రొమాంటిక్, చలాకీ పాత్రలకు పెట్టింది పేరు ఈ బాలీవుడ్ నటుడు. ఆయన్ని చూస్తే ఒక హుషారు వస్తుంది. వ్యక్తిగత జీవితంలో కూడా రిషి చాలా సరదాగా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో ఆయనెంత చురుగ్గా ఉండేవారో తెలిసిందే.
ఇక క్యాన్సర్ బారిన పడి.. రెండేళ్లుగా మృత్యువుతో పోరాటం చేస్తున్న దశలో కూడా ఆయనలో హుషారు తగ్గలేదు. తాను క్యాన్సర్ బారిన పడ్డట్లు చాలా మామూలుగానే చెప్పాడు. చికిత్స తీసుకుని వచ్చాక కూడా అప్ డేట్ ఇచ్చాడు. తర్వాత కొన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాడు.
ఇటీవల ఆయన ఆరోగ్యం విషమించింది. ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఐతే ఇక తాను ఎన్నో రోజులు బతకనని.. చివరి ఘడియలు సమీపించాయని తెలిశాక కూడా రిషి ఏమీ కుంగిపోలేదట. చాలా మామూలుగానే ఉన్నాడట. ఆసుపత్రిలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందితో చాలా హుషారుగా ఉన్నాడట.
రిషి మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఉదయం 8.45 గంటలకు రిషి చాలా ప్రశాంతంగా తుది శ్వాస విడిచినట్లు పేర్కొన్న ఆయన కుటుంబం.. చివరి శ్వాస విడిచే వరకు ఆయన తమను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారని వెల్లడించింది.
రెండేళ్లుగా క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్న రిషి.. ఏ రోజూ విషాదంలోకి వెళ్లలేదని.. చాలా సరదాగానే ఈ సమయాన్ని గడిపాడని కూడా ఈ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. కుటుంబం, స్నేహితులు, తిండి, సినిమాలు.. వీటి మీదే ఆయన ఫోకస్ అంతా ఉందని.. ఏ రోజూ తన జబ్బు తనపై ఆధిపత్యం సాధించే అవకాశమే ఇవ్వలేదని చెప్పారు.
మరణానంతరం తనను ప్రపంచం కన్నీళ్లతో కాకుండా ఒక నవ్వుతో గుర్తుంచుకోవాలని రిషి కోరుకున్నట్లు చెప్పిన ఆయన కుటుంబం.. లాక్ డౌన్ నేపథ్యంలో ఎవ్వరూ ఆయన్ని చూసేందుకు నిబంధనల్ని అతిక్రమించవద్దని కోరింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates